న్యూఢిల్లీ: ఐసీసీ వన్డే ప్రపంచకప్ టోర్నీకి (ICC One Day World Cup) భారత్ (Bharath) ఆతిథ్యమివ్వనుంది. అక్టోబర్ 5న టోర్నీ ఆరంభమవుతుంది. ఫైనల్ సహా మొత్తం 46 మ్యాచ్‌లను 12 వేదికల్లో నిర్వహించనున్నారు. ఇందులో అహ్మదాబాద్, లక్నో, ముంబై, రాజ్‌కోట్, బెంగళూరు, ఢిల్లీ, ఇండోర్, చెన్నై, కోల్‌కతా, మొహాలి, గువాహటి, హైదరాబాద్ ఉన్నాయి. వీటిలో తమకు అనువైనవాటిని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (Pakistan Cricket board) ఎంపికచేసుకున్నది. భద్రతా కారణాల రీత్యా తమకు చెన్నై, కోల్‌కతా అయితే ఓకే అని, ఆ నగరాల్లోనే తమ మ్యాచ్‌లు ఆడతామంటూ ఐఐసీ ఉన్నతాధికారులతో పీసీబీ సంప్రదింపులు జరుపుతున్నది.
అయితే వరల్డ్ కప్‌నకు సంబంధించి మ్యాచ్‌లను ఎక్కడ నిర్వహించాలనేది బీసీసీఐ (BCCI), భారత ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది. దీంతో ఒకవేళ చాన్స్ ఇస్తే కోల్‌కతా (Kolkata), చెన్నై (Chennai) నగరాల్లో తాము మ్యాచ్‌లు ఆడతామంటూ పాక్ అధికారులు పేర్కొంటున్నారు. 2016లో టీ20 వరల్డ్ కప్ సందర్భంగా కోల్‌కతాలో పాకిస్థాన్ మ్యాచ్ ఆడింది. అక్కడ సెక్యూరిటీ ఏర్పాట్లు పాక్‌కు నచ్చాయి. అదేవిధంగా చెన్నైలో కూడా పాకిస్థాన్‌కు కొన్ని మంచి అనుభవాలు ఉన్నాయి. దీంతో ఆ వేదిక కూడా తమకు అనువైనదిగా భావిస్తున్నది.
కాగా, ఈ వరల్డ్‌కప్‌లో అంతా ఆసక్తి కనబర్చేది దాయాదుల మధ్యపోరుపైనే. దీంతో భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్‌లను అహ్మదాబాద్‌లో (Ahmedabad) నిర్వహిస్తే భారీగా డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆ స్టేడియం సామర్థ్యం లక్షా 32 వేలు. అయితే అహ్మదాబాద్‌లో ఫైనల్ నిర్వహించాలని ఇప్పటికే నిర్ణయించారు. ఈ నేపథ్యంలో వరల్డ్‌కప్ షెడ్యూల్‌ను విడుదల చేసినప్పుడే ఈ విషయంపై ఒక స్పష్టత రానుంది. ఐసీసీ ఈవెంట్స్ కమిటీ, ఆతిథ్య దేశానికి చెందిన క్రికెట్ బోర్డు మ్యాచ్‌ల షెడ్యూల్‌ను త్వరలో నిర్ణయించనున్నాయి.
ఈ ఏడాది పాక్‌లో జరుగనున్న ఏషియా కప్‌ను తాము తటస్థ వేదికల్లో అయితేనే ఆడతామని బీసీసీ తేల్చి చెప్పింది. దీంతో తమదేశంలో భారత్ ఆసియా కప్ ఆడకుంటే.. తాము కూడా ఇండియాలో జరుగనున్న వన్డే ప్రపంచకప్ ఆడేది లేదని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఇప్పటికే ప్రకటించింది. బంగ్లాదేశ్, శ్రీలంకల్లోని తటస్థ వేదికల్లో తామ జట్టు మ్యాచ్‌లను నిర్వహించాలని స్పష్టం చేసింది. అయితే ఇప్పుడు చెన్నై, కోల్‌కతాలో అయితే తాము ఆడుతామంటూ కొత్త రాగం అందుకున్నది.