అబుదాబి: ఆసియాకప్‌లో పాకిస్థాన్ ఇంకా పోటీలోనే ఉంది. టోర్నీలో నిలువాలంటే కచ్చితంగా గెలువాల్సిన మ్యాచ్‌లో పాక్ సమిష్టి ప్రదర్శన కనబరిచింది. మంగళవారం జరిగిన సూపర్-4 మ్యాచ్‌లో పాకిస్థాన్ 5 వికెట్ల తేడాతో శ్రీలంకపై విజయం సాధించింది. తొలుత లంక నిర్ణీత 20 ఓవర్లలో 133/8 స్కోరు చేసింది. కమిందు మెండిస్(44 బంతుల్లో 50, 3ఫోర్లు, 2సిక్స్‌లు) సమయోచిత అర్ధసెంచరీతో జట్టుకు పోరాడే స్కోరుకు అందించాడు. ఆఫ్రిదీ(3/28) మూడు వికెట్లు తీయగా, రవూఫ్(2/37), హుస్సేన్ (2/18) రెండేసి వికెట్లు పడగొట్టారు. ఆ తర్వాత లక్ష్యఛేదనకు దిగిన పాక్ 18 ఓవర్లలో 138/5 స్కోరు చేసింది. నవాజ్(38 నాటౌట్), హుస్సేన్(32 నాటౌట్) పాక్ విజయంలో కీలకమయ్యారు. తీక్షణ, హసరంగ రెండేసి వికెట్లతో రాణించారు.
పాక్ స్టార్ పేసర్ ఆఫ్రిదీ ఆదిలోనే లంకను కోలుకోలేని ఎదురుదెబ్బ తీశాడు. ఇన్నింగ్స్ తొలి ఓవర్ రెండో బంతికే కుశాల్ మెండిస్(0)ను ఔట్ చేశాడు. వచ్చి రావడంతో సిక్స్‌తో ఆకట్టుకున్న నిస్సనక(8)..కీపర్ క్యాచ్‌తో ఔటయ్యాడు. దీంతో లంక 18 పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయింది. ఓవైపు వికెట్లు పడుతున్నా..కెప్టెన్ అసలంక(20) బౌండరీలతో ఆకట్టుకున్నాడు. బౌలింగ్ మార్పుగా వచ్చిన రవూఫ్‌ను ఫోర్‌తో ఆహ్వానించిన కుశాల్ పెరెరా(15) మూడో వికెట్‌గా పెవిలియన్ చేరడంతో పవర్‌ప్లే ముగిసే సరికి లంక 3 వికెట్లు కోల్పోయి 53 పరుగులు చేసింది. దెబ్బ మీద దెబ్బ అన్నట్లు హుస్సేన్ 8వ ఓవర్లో అసలంకతో పాటు శనక(0) వరుస బంతుల్లో ఔట్ కావడంతో లంక 58 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది. ఈ తరుణంలో పాక్ అంచనాలను కమిందు మెండిస్ తలకిందులు చేశాడు. ఈ క్రమంలో ఆరో వికెట్‌కు హసరంగతో 22 పరుగులు, ఏడో వికెట్‌కు కరుణరత్నె(17 నాటౌట్) తో కలిసి 43 పరుగులు జోడించాడు.
నిర్దేశిత లక్ష్యఛేదనలో పాక్ ఓపెనర్లు జమాన్(17), ఫర్హాన్(24) ఒకింత మెరుగైన శుభారంభం అందించారు. వీరిద్దరు కలిసి తొలి వికెట్‌కు 45 పరుగులు జోడించారు. దూకుడు మీద కనిపించిన వీరిద్దరిని మహిశ్ తీక్షణ(2/24) ఆరో ఓవర్లో బంతి తేడాతో పెవిలియన్ పంపాడు. ఈ దశలో ఆదుకుంటారనుకున్న సయిమ్(2), కెప్టెన్ సల్మాన్(5)ను హసరంగ బుట్టలో వేసుకున్నాడు. 80 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన పాక్‌ను నవాజ్, హుస్సేన్ ఒడ్డున పడేశారు.వీరిద్దరు కలిసి ఆరో వికెట్‌కు అజేయంగా 58 పరుగులు జతకలిపారు.
శ్రీలంక: 20 ఓవర్లలో 133/8 (మెండిస్ 50, అసలంక 20, ఆఫ్రిదీ 3/28, హుస్సేన్ 2/18),
పాకిస్థాన్: 18 ఓవర్లలో 138/5(నవాజ్ 38 నాటౌట్, హుస్సేన్ 32 నాటౌట్, తీక్షణ 2/24, హసరంగ 2/27)