T20 World Cup : బంగ్లాదేశ్ కు మద్దతుగా తమ జట్టు టీ20 వరల్డ్ కప్ టోర్నీలో పాల్గొనబోదని జరుగుతున్న ప్రచారాన్ని పాకిస్తాన్ ఖండించింది. ఇదంతా అసత్య ప్రచారమేనని పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ (పీసీబీ) తేల్చిచెప్పింది. భారత్-బంగ్లాదేశ్ మధ్య టీ20 వరల్డ్ కప్ అంశంలో వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. ఇండియాలో జరగబోయే ఈ టోర్నీలో తాము పాల్గొనబోమని బంగ్లా హెచ్చరించింది.
భద్రతా కారణాల రీత్యా ఇండియాకు రాలేమని, మ్యాచ్ జరిగే వేదికల్ని మరో చోటుకు మార్చాలని ఐసీసీని బంగ్లా కోరింది. దీనిపై ఇంకా నిర్ణయం వెలువడాల్సి ఉంది. ఇదే సమయంలో బంగ్లాదేశ్ కు మద్దతుగా పాకిస్తాన్ కూడా టీ20 వరల్డ్ కప్ బహిష్కరించినట్లు కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. తాజాగా దీనిపై పీసీబీ స్పందించింది. తాము టోర్నీని బహిష్కరిస్తున్నట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని పీసీబీ సభ్యులు తెలిపారు. ఈ టోర్నీకి సంబంధించి గత ఏడాది ప్రారంభంలోనే ఒప్పందం కుదిరిందని చెప్పారు. అప్పటికి ఇండియా.. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం పాక్ రాలేనని చెప్పిందని, దీంతో తాము కూడా టీ20 వరల్డ్ కప్ కోసం ఇండియాలో కాకుండా శ్రీలంకలో మ్యాచులు ఆడతామని చెప్పినట్లు తెలిపారు.
ముందే ఇండియాలో కాకుండా, శ్రీలంకలో మ్యాచులు నిర్వహించాలని నిర్ణయించినందున ఈ టోర్నీని తాము బహిష్కరించడం లేదన్నారు. దీంతో ఈ టోర్నీలో పాక్ పాల్గొంటుందని స్పష్టమైంది. అయితే, బంగ్లాదేశ్ పాల్గొనే విషయంలో ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. బంగ్లా ఆడేందుకు నిరాకరిస్తే ఆ స్థానంలో మరో జట్టును రంగంలోకి దించాలని ఐసీసీ భావిస్తోంది. ఇదే జరిగితే బంగ్లాదేశ్ కు పెద్ద ఎదురుదెబ్బే.