T20 World Cup : టీ20 వరల్డ్ కప్ 2026లో పాల్గొనే అంశంపై పాకిస్తాన్ ఇంకా అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ఐసీసీ హెచ్చరించిన తర్వాత కూడా పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ (పీసీబీ) వైఖరిలో మార్పు రానట్లు కనిపిస్తోంది. టోర్నీలో పాల్గొనే అంశంపై ప్రభుత్వ అనుమతి కోసం ఎదురు చూస్తోంది. టోర్నీ నుంచి బంగ్లాదేశ్‌ను ఐసీసీ తొలగించి, ఆ స్తానంలో స్కాట్లాండ్కు అవకాశం కల్పించింది. దీంతో బంగ్లాకు మద్దతుగా తాము కూడా టోర్నీలో పాల్గొనే అంశంపై ఆలోచిస్తామని, తమ ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా నడుచుకుంటామని పాక్ ఐసీసీకి తెలిపింది.
దీనికి స్పందించిన ఐసీసీ.. టోర్నీలో పాల్గొనకుంటే పాక్‌పై తీవ్ర ఆంక్షలు విధిస్తామని హెచ్చరించింది. దీంతో స్పందించిన పాక్.. టీ20 జట్టును ప్రకటించింది. ఇక.. టోర్నీలో పాక్ గ్యారెంటీగా ఆడుతుందని అంతా అనుకుంటుండగా.. ఇక్కడే మెలిక పెట్టింది. తాము జట్టును మాత్రమే ప్రకటించామని.. దానర్థం టోర్నీలో తప్పకుండా ఆడుతామని కాదని పాక్ క్రికెట్ వర్గాలు అంటున్నాయి. ఈ విషయంలో పాకిస్తాన్ రెండు ఆప్షన్లు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకటి.. బంగ్లాకు మద్దతుగా టోర్నీని పూర్తిగా బహిష్కరించడం. రెండోది ఇండియాతో జరిగే మ్యాచును మాత్రమే బహిష్కరించడం. ఈ రెండిట్లో ఏదో ఒకటి చేయాలని చూస్తోంది. మరోవైపు టోర్నీలో పాల్గొనడంపై అక్కడి ప్రభుత్వ అనుమతి కోసం పాక్ జట్టు ఎదురుచూస్తోంది. పాక్ ప్రభుత్వం సూచిస్తే టోర్నీని వీడేందుకు పాక్ సిద్ధంగా ఉంది.
ఇండియాలో టోర్నీ జరుగుతుండటమే బంగ్లా, పాక్ ఒత్తిడికి కారణం. ఇప్పటికే పాకిస్తాన్ ఆడే మ్యాచుల్ని శ్రీలంకలో నిర్వహించనుండగా.. తాము కూడా ఇండియాకు రాలేమని, తమకు కూడా మరో వేదిక కావాలని బంగ్లా డిమాండ్ చేసింది. కానీ, దీనికి ఐసీసీ ఒప్పుకోకుండా.. స్కాట్లాండ్ను రంగంలోకి దించింది. ఇండియా-పాక్ మధ్య ఫిబ్రవరి 15న శ్రీలంకలోని కొలంబోలో మ్యాచ్ జరగనుంది.