Pakistan Legend : అంతర్జాతీయ క్రికెట్లో స్టార్ ఆటగాళ్ల మధ్య పోటీ ఉండడం మామూలే. ఒకరిని మించి ఒకరు రాణిస్తే అతడే గ్రేట్ అని కితాబిచ్చేయడం.. ఎవరైనా రికార్డులు బద్ధలు కొడితే చాలు కొందరితో పోల్చడం అనేది పరిపాటి అయింది. అలానే పాకిస్థాన్ సారథి బాబర్ ఆజాం (Babar Azam)ను భారత ఆటగాడు విరాట్ కోహ్లీ (Virat Kohli)తో పోలుస్తుంటారు పాక్ మాజీలు కొందరు. అయితే.. ‘బాబర్‌కు అంత సీన్ లేద’ని ఆ దేశ దిగ్గజం జహీర్ అబ్బాస్ (Zaheer Abbas) సంచలన వ్యాఖ్యలు చేశాడు.
తాజాగా ఓ కార్యక్రమంలో జహీర్ అబ్బాస్ మాట్లాడుతూ.. కోహ్లీ వరల్డ్ క్లాస్ ప్లేయర్ అని, అతడికి బాబర్‌కు పోలిక లేదని చెప్పాడు. ‘కోహ్లీ ప్రతి మ్యాచులో పరుగులు సాధిస్తాడు. కానీ, బాబర్ అలా కాదు. ఏ మ్యాచ్‌లోనూ బాబర్ పెద్దగా రాణించింది లేదు. మరి అలాంటప్పుడు కోహ్లీతో అతడిని ఎలా పోలుస్తారు. నా దృష్టిలో ఇద్దరి మధ్య పోలిక అనేది అర్థ రహితం’ అని అన్నాడు. అంతేకాదు ప్రస్తుత భారత జట్టు ప్రదర్శనపై కూడా అబ్బాస్ స్పందించాడు.
VIDEO | Pakistan great Zaheer Abbas feels the comparisons between Virat Kohli and Babar Azam are baseless as the Indian superstar is a lot more consistent than the under-fire Pakistan batter.
“Yeh fizool ki baatein hai (the comparisons are pointless). Virat Kohli scores in every… pic.twitter.com/lXrTj4BSup
— Press Trust of India (@PTI_News) September 30, 2024
‘టీమిండియా చాలా బలమైనది. బ్యాటర్లతో పాటు బౌలర్లు కూడా గొప్ప ప్రదర్శన చేస్తున్నారు. భారత్ చాలా సమతూకంగా ఉన్న జట్టు. టీమ్‌లోని ప్రతి ఒక్కరికి తమ బాధ్యతలు తెలుసు. ఇక కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) అయితే సూపర్. అతడికి ఆటపై ఉన్న అవగాహన అమోఘం. ఈమధ్య అన్నీ టీమిండియాకు అనుకూలంగా జరుగుతున్నాయి’ అంటూ పరోక్షంగా పాకిస్థాన్ జట్టును అబ్బాస్ విమర్శించాడు.
అంతర్జాతీయ వేదికల్లో ప్రదర్శన, రికార్డులు, గణాంకాలు.. ఏ రకంగా చూసినా కోహ్లీకి బాబర్ సరితూగడు. మూడు ఫార్మట్లలో కింగ్ అనిపించుకున్న విరాట్ 80 శతకాలు సాధించగా.. పాక్ కెప్టెన్ 31 సెంచరీలు కొట్టాడంతే. అంతేకాదు కోహ్లీ పెద్ద జట్లపై విరుచుకుపడి చిరస్మరణీయ ఇన్నింగ్స్‌లతో ఫ్యాబ్-4లో నిలిచాడు.
కానీ, బాబర్ అలా కాదు. చిన్న జట్లపైనే అతడి రికార్డులన్నీ. పెద్ద వేదికలపై అతడు గొప్పగా ఆడిన సందర్భాలు ఒకటి అరా అంతే. అందుకనే అతడిని కోహ్లీతో పోల్చడం సరికాదని పలువురు చాలాసార్లు అభిప్రాయపడ్డారు.