Paris Olympics 2024 : ఒలింపిక్స్‌లో భారత పురుషుల హాకీ జట్టు (India Mens Hockey Team) చరిత్రకు రెండడుగలు దూరంలో ఉంది. 44 ఏండ్లుగా ఊరిస్తున్న పసిడి పతకాన్ని ముద్దాడాలని టీమిండియా పట్టుదలతో ఉంది. మంగళవారం సెమీ ఫైనల్లో జర్మనీ(Germany)తో మర్మన్ప్రీత్ సింగ్ సేన అమీతుమీ తేల్చుకోనుంది. కీలకమైన ఈ పోరుకు ముందు పాకిస్థాన్ దిగ్గజం హసన్ సర్దార్ (Hassan Sardar) భారత జట్టుకు ఆల్ ది బెస్ట్ చెప్పాడు. ఈసారి తన మద్దతు భారత్‌కే అని, ఇండియా స్వర్ణం గెలవాలని కోరుకుంటున్నానని అన్నాడు.
‘భారత జట్టు బలంగా ఉంది. గెలవడం కోసమే వాళ్లు ఆడుతున్నారు. ఇక ఆస్ట్రేలియాపై భారత జట్టు ఆడిన తీరు చూసి ఎంతో ముగ్ధుడిని అయ్యాను. క్రికెట్ అయినా, హాకీ అయినా పాకిస్థాన్ పోటీలో లేదంటే కచ్చితంగా నా మద్దుతు ఇండియాకే. నేను ఇంతవరకూ చూసిన భారత జట్లలో ఇదే అత్యుత్తమం. యూరోపియన్ జట్లను ఎదుర్కొని ఆటగాళ్లంతా ఎంతో మెరుగయ్యారు. అందుకని ఈసారి భారత జట్టు కచ్చితంగా స్వర్ణం గెలవాలి అని’ సర్దార్ ఓ టీవీ ఇంటర్వ్యూలో తెలిపాడు.
పాకిస్థాన్ దిగ్గజం హసన్ సర్దార్
విశ్వ క్రీడల్లో పునఃవైభవం దిశగా అడుగులేస్తున్న భారత హాకీ జట్టు వరుసగా రెండోసారి సెమీస్ చేరింది. టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతక పోరులో జర్మనీని ఓడించి దేశానికి మెడల్ అందించింది. ఈసారి కచ్చితంగా స్వర్ణమే లక్ష్యంగా పెట్టుకున్న టీమిండియా అదరగొడుతోంది.
ప్రీ క్వార్టర్స్‌లో ఆస్ట్రేలియాపై 3-2తో గెలిచి 52 ఏండ్ల రికార్డును బ్రేక్ చేసిన భారత్.. అనంతరం క్వార్టర్ ఫైనల్లో బ్రిటన్ను షూటౌట్లో 4-2తో మట్టికరిపించింది. అయితే సెమీస్‌లో జర్మనీతో మ్యాచ్‌కు డిఫెండర్ అమిత్ రోహిదాస్ అందుబాటులో లేకపోవడం భారత్‌ను ఆందోళనకు గురి చేస్తోంది. కానీ, బ్రిటన్‌పై అమిత్ రెడ్‌కార్డ్‌తో బయటకు వెళ్లగా 10 మందితోనే ఆడిన హర్మన్‌ప్రీత్ సేన సంచలన విజయం నమోదు చేసింది.