కర్నాటకలో సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కార్ అవినీతికి పాల్పడుతున్నదని ఆరోపిస్తూ బీజేపీ-జేడీఎస్ చేపట్టిన ఛలో మైసూర్ పాదయాత్రపై కర్నాటక మంత్రి డాక్టర్ శరణ్ ప్రకాష్ పాటిల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వారు పాదయాత్ర చేయడం లేదని పశ్చాత్తాప యాత్ర చేస్తున్నారని వ్యాఖ్యానించారు. పాటిల్ మంగళవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ కర్నాటకలో అవినీతిని ప్రారంభించిందే కాషాయ నేతలని దుయ్యబట్టారు.
ఈ విషయంలో తాము ప్రజల్లో అవగాహన తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని అన్నారు. బీజేపీ నేతలు తాము చేసిన తప్పిదాలను కప్పిపుచ్చుకునేందుకే పాదయాత్ర పేరిట హంగామా చేస్తున్నారని మంత్రి డాక్టర్ శరణ్ ప్రకాష్ పాటిల్ ఆరోపించారు. అవినీతిలో నిండా మునిగిన కాషాయ నేతలు తాము అధికారం కోల్పోగానే ఇప్పుడు అవినీతి జరుగుతోందని గగ్గోలు పెడుతున్నారని మంత్రి బీజేపీ నేతలను ఎద్దేవా చేశారు.
ఇక ముడా, వాల్మీకీ కుంభకోణాల్లో కర్నాటక సీఎం హస్తముందని, ఈ అవినీతి కుంభకోణాల్లో కూరుకుపోయిన సీఎం సిద్ధరామయ్య తక్షణమే పదవికి రాజీనామా చేయాలని పాదయాత్రలో పాల్గొన్న బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ సర్కార్ అవినీతికి వ్యతిరేకంగా బీజేపీ నేతలు చేపట్టిన బెంగళూరు-మైసూర్ పాదయాత్ర వారం రోజుల పాటు కొనసాగనుంది. నాలుగో రోజు పాదయాత్రలో కేంద్ర మంత్రి, జేడీఎస్ నేత హెచ్డీ కుమారస్వామి, ఆయన కుమారుడు, పార్టీ యువనేత నిఖిల్ కుమారస్వామి, కర్నాటక బీజేపీ చీఫ్ బీవై విజయేంద్ర, ఆర్ అశోక తదితరులు పాల్గొన్నారు.
Read More :
Bomb Threat | అల్-ఖైదా పేరుతో బీహార్ సీఎంకు బాంబు బెదిరింపులు.. వ్యక్తి అరెస్ట్