India vs Pakistan : ప్రపంచ క్రికెట్లో కొన్ని మ్యాచ్‌లు గొప్ప సమరంగా చరిత్రలో నిలిచిపోతాయి. వాటిలో భారత్, పాకిస్థాన్ మ్యాచ్ ఒకటి. అందుకనే చిరకాల ప్రత్యర్థులు మైదానంలో దిగితే చూడాలని అభిమానులు ఆశగా ఎదురుచూస్తారు. చిరకాల ప్రత్యర్థులు ‘నువ్వానేనా’ అన్నట్టు తలపడుతుంటే అభిమానులు కంటి రెప్ప కూడా వాల్చరు. అయితే.. గత కొంత కాలంగా భారత్, పాక్ జట్ల మధ్య మ్యాచ్‌లు బొత్తిగా తగ్గిపోయాయి. ఈ నేపథ్యంలో పాక్ మాజీ స్పిన్నర్ సయీద్ అజ్మల్(Saeed Ajmal) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
చంద్రుడిపై ఆడినా సరే.. ఇండో -పాక్ మ్యాచ్‌పై ఉండే క్రేజ్ మాత్రం తగ్గదని అజ్మల్ అన్నాడు. వచ్చే ఏడాది పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వనున్న చాంపియన్స్ ట్రోఫీ(Champions Trophy 2025)లో భారత జట్టు ఆడుతుందా? లేదా? అనేది ఇంకా స్పష్టం కాలేదు. ఈ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకున్న అజ్మల్.. ‘భారత్, పాకిస్థాన్‌ల మధ్య క్రికెట్ సంబంధాలు మెరుగుపడాలని ఆకాంక్షించాడు.
భారత్, పాక్ జట్ల మధ్య ఎక్కువ మ్యాచ్‌లు జరగాలి. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు నిర్వహించాలి. ఎందుకంటే.. రెండు దేశాల మధ్య ఎంతో ప్రేమ ఉంది. ఒకవేళ భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌లను చంద్రుడిపై పెట్టినా సరే.. ఇసుమంత కూడా ఆదరణ తగ్గదు’ అని తెలిపాడు.
సరిహద్దు వివాదాల కారణంగా భారత్, పాకిస్థాన్‌ల మధ్య ద్వైపాక్షిక సిరీస్(Bilateral Series)లు రద్దయ్యాయి. దాంతో, ప్రస్తుతానికి ఐసీసీ టోర్నీల్లోనే దాయాది జట్లు తలపడుతున్నాయి. ఇరుజట్ల మధ్య 2012-13లో చివరి ద్వైపాక్షిక సిరీస్ జరిగింది. ఇక.. భారత జట్టు చివరిసారిగా 2008లో పాకిస్థాన్ గడ్డపై కాలు మోపింది. అప్పటినుంచి భద్రతా కారణాల వల్ల టీమిండియాను పంపేందుకు బీసీసీఐ ఇష్టపడడం లేదు.
నిరుడు ఆసియా కప్(Asia Cup 2023) కోసం పాకిస్థాన్‌కు వెళ్లేది లేదని బీసీసీఐ సెక్రటరీ జై షా(Jai Shah) తేల్చిచెప్పాడు. దాంతో, దిగొచ్చిన ఐసీసీ.. ఆసియా కప్‌ను హైబ్రిడ్ మోడల్లో నిర్వహించింది. ఇప్పుడు పాక్ గడ్డపై జరుగబోయే చాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు ఆడడంపై సందేహాలు నెలకొన్నాయి. ఒకవేళ టీమిండియా వెళ్లకుంటే టోర్నీని యూఏఈకి తరలిస్తారనే వార్తలు ప్రచారమవుతున్నాయి.