Viral | రెక్కాడితే గానీ డొక్కాడని నిరుపేద కుటుంబాలు నివాసముండే బస్తీల నుంచి ఆగర్భ శ్రీమంతులు ఉండే హైఫై గేటెడ్ కమ్యూనిటీల దాకా కులం, మతం తేడా లేకుండా అందరినీ కుట్టే దోమలు కొందరికి మాత్రం స్పెషల్ ట్రీట్మెంట్ ఇస్తాయట. అపరిశుభ్రత, కంపు కొట్టే కాలనీలల్లోనే కాదు.. బీరు బాబులంటే దోమలు పడిచస్తాయట. సాధారణ జనాలతో పోలిస్తే పీపాలకు పీపాలు బీర్లు తాగేవారి రక్తాన్ని పీల్చడమంటే దోమలకు మహా సరదా అని తాజాగా ఓ అధ్యయనం హెచ్చరించింది.
గత నెల (ఆగస్టు)ను ప్రపంచవ్యాప్తంగా ‘బీర్ మంత్’గా జరుపుకుంటారు. ఈ సందర్భంగా జపాన్‌కు చెందిన టొయమా యూనివర్సిటీ చేసిన అధ్యయనంలో సంచలన విషయాలు వెలుగుచూశాయి. ఈ నివేదిక ప్రకారం.. బీర్లను అదేపనిగా సేవించేవారి రక్తాన్ని పీల్చడానికి దోమలు అధికంగా ఆకర్షితమవుతాయట. బీర్లు అధికంగా తాగడం మూలానా సదరు వ్యక్తిలోంచి విడుదలయ్యే చెమటను పీల్చడానికి దోమలు నగరంలో ఏ మూలన ఉన్నా రాకెట్ స్పీడ్‌తో వారి వద్దకు చేరుకుని పనికానిచ్చేస్తాయట. అంతేగాక బీర్లు తెరవగానే వచ్చే వాసన నుంచి వెలువడే Co2కూ దోమలు అట్రాక్ట్ అవుతాయని అధ్యయనం తేల్చింది.
‘కుకిస్ట్వావ్’ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్‌లో ఇందుకు సంబంధించిన విషయాలను పోస్ట్ చేయడంతో ఇది కాస్తా వైరల్ అయింది. దీనిపై నెటిజన్లూ ఆసక్తికర కామెంట్స్ చేస్తున్నారు. ‘వార్నీ.. నిన్న రాత్రి దోమలు నన్ను తెగ కుట్టాయి. ఎందుకా అనుకున్నా. కారణం ఇదా..’, ‘కూల్.. అయితే బీర్ తాగేప్పుడు దోస్తులతో పాటు దోమలకూ చీర్స్ కొట్టాలన్నమాట..’ అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. మరో నెటిజన్ స్పందిస్తూ ‘మరి నేను నా జీవితంలో ఇంతవరకూ ఆల్కహాల్ వాసనే చూడలేదు. మరి దోమలు నన్నెందుకు కుడుతున్నాయి?’ అంటూ ప్రశ్నించాడు. ఏదేమైనా సాయంత్రం కాగానే చిల్డ్ బీర్ తీసుకుని తాగుదామనకునే మందుబాబులు.. జర జాగ్రత్త..! అసలే ఎడతెరిపి లేని వానలకు దోమలు పొద్దస్తమానం గస్తీ తిరుగుతూ జనాల ప్రాణాలను తోడేస్తున్నాయి. మీరుగనక ఆదమరిచి తాగారో.. ఇక మీ రక్తం దోమార్పణమే!