PCB | కరాచీ : మూడు దశాబ్దాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత లేకలేక ఒక ఐసీసీ టోర్నీకి ఆతిథ్యమిచ్చిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)కు చాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ భారీ నష్టాలనే మిగిల్చిందా? అంటే అవుననే అంటున్నాయి పీసీబీ వర్గాలు. ఈ టోర్నీ నిర్వహణకు పీసీబీ రూ.869 కోట్లు పెడితే 85 శాతం నష్టం (రూ.739 కోట్లు) వచ్చినట్లు స్థానిక మీడియా కోడై కూస్తోంది. ఓ నివేదిక ప్రకారం.. ఈ ట్రోఫీలో మ్యాచ్లకు ఆతిథ్యమిచ్చిన రావల్పిండి, లాహోర్, కరాచీ స్టేడియాల పునర్నిర్మాణానికి పీసీబీ సుమారు 18 బిలియన్ డాలర్లు ఖర్చు చేసింది.
ఇది వారి ప్రతిపాదిత బడ్జెట్ కంటే 50 శాతం అధికం. ఇక ఈవెంట్ సన్నాహకాలు, ఇతరత్రా ఖర్చులకు గాను 40 మిలియన్ డాలర్లు వెచ్చించింది. అయితే ఆతిథ్య దేశానికి హక్కుగా రావాల్సిన హోస్టింగ్ ఫీజుతో పాటు టికెట్ అమ్మకాలు, స్పాన్సర్షిప్స్ నుంచి 6 మిలియన్ డాలర్లు మాత్రమే పీసీబీ ఖజానాకు చేరింది. దీంతో పీసీబీపై 85 మిలియన్ డాలర్ల నష్టపోయినట్లు ‘డాన్’ పత్రిక ఓ కథనంలో పేర్కొంది. అయితే చాంపియన్స్ ట్రోఫీ నష్టాలను పీసీబీ.. ఆ దేశ క్రికెటర్ల మ్యాచ్ ఫీజులను తగ్గించడం ద్వారా పూడ్చుకుంటున్నట్టు కథనాలు వెలువడుతున్నాయి.