దుబాయ్: ప్రతిష్టాత్మక ఆసియా కప్ టోర్నీలో పాకిస్థాన్ శుభారంభం చేసింది. శుక్రవారం జరిగిన గ్రూపు-ఏ లీగ్ మ్యాచ్‌లో పాక్ 93 పరుగుల తేడాతో పసికూన ఒమన్‌పై ఘన విజయం సాధించింది. తొలుత టాస్ గెలిచిన పాక్ కెప్టెన్ సల్మాన్ ఆగా..బ్యాటింగ్ వైపు మొగ్గుచూపాడు. యువ బ్యాటర్ మహమ్మద్ హరిస్(43 బంతుల్లో 66, 7ఫోర్లు, 3సిక్స్‌లు) అర్ధసెంచరీతో పాక్ టీమ్ నిర్ణీత 20 ఓవర్లలో 160/7 స్కోరు చేసింది. షా ఫైజల్(3/34), అమీర్ కలీమ్(3/31) మూడేసి వికెట్లు తీశాడు. ఆ తర్వాత లక్ష్యఛేదనకు దిగిన ఒమన్ 16.4 ఓవర్లలో 67 పరుగులకు కుప్పకూలింది.
మొదట బ్యాటింగ్‌కు దిగిన పాక్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఇన్నింగ్స్ మొదటి ఓవర్ రెండో బంతికే ఓపెనర్ సయిమ్ ఆయూబ్(0) డకౌట్‌గా వెనుదిరిగాడు. ఫైజల్ బౌలింగ్‌లో వికెట్ల ముందు అడ్డంగా దొరికిపోయిన ఆయూబ్..డీఆర్ఎస్కు వెళ్లినా లాభం లేకపోయింది. దీంతో నాలుగు పరుగులకే పాక్ తొలి వికెట్ కోల్పోయింది. మరో ఓపెనర్ ఫర్హాన్(29) రెండు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద కలీమ్ క్యాచ్ విడిచిపెట్టడంతో బతికిపోయాడు. ఫర్హాన్, హరిస్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. బౌండరీల రాక మందగించగా, హరిస్ 14 పరుగుల వద్ద ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. అయితే ఆమిర్ వేసిన ఆరో ఓవర్లో ఫర్హాన్ ఫోర్కు తోడు హరిస్ ఫోర్, సిక్స్‌తో 16 పరుగులు వచ్చి చేరడంతో పవర్‌ప్లే ముగిసే సరికి పాక్ 47/1 స్కోరు చేసింది.
ఫర్హాన్‌ను అండగా చేసుకుంటూ హరిస్ బ్యాటు ఝులిపించే ప్రయత్నం చేశాడు. పసలేని ఒమన్ బౌలింగ్‌ను అలవోకగా ఎదుర్కొంటూ బౌండరీలతో విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో ఓ భారీ సిక్స్‌తో 32 బంతుల్లో హరిస్ అర్ధసెంచరీ మార్క్ అందుకున్నాడు. ఇన్నింగ్స్ గాడిలో పడిందనుకున్న తరుణంలో ఫర్హాన్..కలీమ్‌కు రిటర్న్ క్యాచ్ ఇచ్చి ఔట్ కావడంతో రెండో వికెట్‌కు 85 పరుగుల భాగస్వామ్యానికి బ్రేక్ పడింది. ఇదే అదనుగా బౌలింగ్ మార్పుగా వచ్చిన కలీమ్ 13వ ఓవర్లో వరుస బంతుల్లో హరిస్తో పాటు కెప్టెన్ సల్మాన్ ఆగా(0)ను ఔట్ చేసి ఒమన్ శిబిరంలో ఆనందం నింపాడు. ఆ తర్వాత హసన్ నవాజ్(9), అష్రఫ్(8) విఫలం కాగా, జమాన్(23 నాటౌట్), నవాజ్(19) అంతోఇంతో బ్యాటు ఝులిపించడంతో పాక్‌కు గౌరవప్రదమైన స్కోరు దక్కింది.
నిర్దేశిత లక్ష్యఛేదనలో ఒమన్ స్వల్ప స్కోరుకే పరిమితమైంది. రెండో ఓవర్లో కెప్టెన్ జతిందర్సింగ్(1)తో మొదలైన ఒమన్ వికెట్ల పతనం ఆఖరి వరకు కొనసాగింది. హమ్మద్ మీర్జా(27), కలీమ్(13) మినహా ఎవరూ డబుల్ డిజిట్ మార్క్ అందుకోలేకపోయారు. వచ్చిన బ్యాటర్ వచ్చినట్లు పెవిలియన్ వెళ్లేందుకు పోటీపడ్డారు. ముఖీమ్, ఆయూబ్, అష్రఫ్ రెండేసి వికెట్లు తీశారు.
పాకిస్థాన్: 20 ఓవర్లలో 160/7(హరిస్ 66, ఫర్హాన్ 29, కలీమ్ 3/31, ఫైజల్ 3/34), ఒమన్: 16.4 ఓవర్లలో 67 ఆలౌట్(మీర్జా 27, కలీమ్ 13, అష్రఫ్ 2/6, ముఖీమ్ 2/7)