Arshad Nadeem : ఒలింపిక్స్‌లో స్వర్ణంతో చరిత్రకెక్కిన పాకిస్థాన్ అథ్లెట్ అర్షద్ నదీమ్ (Arshad Nadeem) స్వదేశంలో సన్మాన, సత్కార కార్యక్రమాలతో బిజీ అయ్యాడు. అంతేకాదు ఆ దేశ టీవీల్లో సైతం అతడే కనిపిస్తున్నాడు. తాజాగా ఓ టీవీకి నదీమ్ ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ సందర్బంగా అతడు తనకు బహుమతిగా బర్రెను ఇచ్చిన మామపై జోక్ వేశాడు. మామా.. నాకు ఆ బర్రె వద్దు. నువ్వు ఏదైనా ఇవ్వాలనుకుంటే జరంత భూమి ఇవ్వు అని ఫన్నీగా అన్నాడు.
‘పారిస్‌లో గోల్డ్ మెడల్ సాధించిన మా మామ ముహమ్మద్ నవాజ్ నాకు ఏదైనా బహుమతి ఇవ్వాలనుకున్నాడు. ఆయన బర్రెను కానుకగా ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. ఇదే విషయమై నేను భార్యతో.. మీ నాన్న చాలా ధనవంతుడు కదా. ఆయన నాకు కనీసం ఐదు ఎకరాల భూమి ఇవ్వాల్సింది అని అన్నాను. కానీ, నేను ‘ఓకే’ అనడంతో ఆ బర్రెను గిఫ్ట్‌గా పంపాడు. అది కూడా నాకు నచ్చింది’ అని నదీమ్ నవ్వుతూ చెప్పాడు. దాంతో, యాంకర్‌తో పాటు నదీమ్ భార్యకు సైతం నవ్వాగలేదు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Arshad Nadeem reaction on receiving buffalo as a gift from father-in-law.😂 pic.twitter.com/wJGBHeXtVu
— 𝙎𝙝𝙚𝙧𝙞 (@CallMeSheri1) August 15, 2024
ఫ్యాషన్ నగరి పారిస్ ఆతిథ్యమిచ్చిన ఒలింపిక్స్‌లో నదీమ్ రికార్డు త్రోతో స్వర్ణ పతకం కొల్లగొట్టాడు. హాకీలో తప్ప విశ్వ క్రీడల అథ్లెటిక్స్‌లో గోల్డ్ మెడల్ ఎరుగని పాక్‌కు నదీమ్ ఆ లోటు తీర్చాడు. ఉత్కంఠగా సాగిన ఫైనల్లో 92.97 మీటర్ల దూరం ఈటెను విసిరి పాక్‌కు తొలి పసిడిని అందించాడు. ఇక టోక్యో ఒలింపిక్స్‌లో పసిడిని ముద్దాడిన నీరజ్ చోప్రా (Neeraj Chopra).. పారిస్‌లో రజతంతో సరిపెట్టుకున్నాడు.
పారిస్ ఒలింపిక్స్ పసిడితో నదీమ్ జీవితం ఒక్కసారిగా మారిపోయింది. అప్పటిదాకా అతడికి పైసా సాయం చేయనివాళ్లు ఇప్పుడు ఏకంగా కోటి రూపాయలు ఇచ్చేందుకు ముందుకొస్తున్నారు. ఒకానొక దశలో బంధువులు, స్నేహితుల అండతో జావెలిన్ ఆటను కొనసాగించిన నదీమ్.. పట్టుదలతో ఒలింపిక్స్ గోల్డ్ మెడల్ కొల్లగొట్టాడు. దాంతో, పాక్‌లోని ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. ఒలింపిక్ విజేతగా అతడి ఘనతను పాక్ ప్రజలు వేనోళ్ల పొగుడుతున్నారు. అంతేకాదు పలువరు సెలబ్రిటీలు, సామాన్యులు సైతం నదీమ్‌కు ఆర్ధిక సాయం అందిస్తుండడం విశేషం.