T20 World Cup : ఆటలోనే కాదు నిర్ణయాలలోనూ అనిశ్చితికి తామే కేరాఫ్ అని చాటుకుంది పాకిస్థాన్. టీ20 ప్రపంచకప్ పోటీలకు వారం రోజులే ఉందనగా పాక్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. వరల్డ్‌కప్ కోసం జట్టును పంపిస్తామని, కానీ ఫిబ్రవరి 15న కొలంబోలో భారత జట్టుతో మాత్రం పాక్ తలపడదని తెలిపింది. ఇరుదేశాల బోర్డుల మధ్య వివాదాల నేపథ్యంలో పాక్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.
ఈ ఏడాది పురుషుల టీ20 ప్రపంచకప్ ప్రారంభానికి ముందే వార్తల్లో నిలుస్తోంది. భద్రతా కారణాలరీత్యా భారత్‌లో వరల్డ్‌కప్ మ్యాచ్‌లు ఆడబోమని బెట్టు చేసిన బంగ్లాదేశ్‌ను ఐసీసీ తప్పించడంతో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కొత్త పంచాయతీకి తెరతీసింది బంగ్లాదేశ్‌ను మెగా టోర్నీ నుంచి తప్పించడాన్ని ఖండించిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డు బాయ్‌కాట్ చేయాలనుకుంది. వరల్డ్ కప్‌లో తమ జట్టు ఆడుతుందో లేదో తెలియదని, ప్రభుత్వం అనుమతి వస్తేనే ఆడుతామని పీసీబీ చీఫ్ మొహ్సిన్ నఖ్వీ ప్రకటించడంతో ఉత్కంఠ నెలకొంది. కానీ, మరునాడే స్క్వాడ్‌ను వెల్లడించింది. ఇక అంతా సద్దుమణిగినట్టే అనుకున్నవేళ.. భారత జట్టుతో మ్యాచ్ ఆడబోమని పీసీబీ కొత్త నాటకం షురూ చేసింది.
#ICCT20WORLDCUP | Pakistan will not play the match against India on February 15th, tweets Government of Pakistan pic.twitter.com/4dUN9Xi1EE
— ANI (@ANI) February 1, 2026
‘పొట్టి ప్రపంచకప్‌లో పాకిస్థాన్ పాల్గొనేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. కానీ, ఫిబ్రవరి 15న భారత్‌తో మ్యాచ్‌లో పాక్ ఆటగాళ్లు మైదానంలోకి దిగరు’ అని పాక్ ప్రభుత్వం తెలిపింది. లాహోర్‌లో ఆదివారం ప్రధాని షెహబాజ్ షరీఫ్‌తో పీసీబీ చీఫ్ నఖ్వీ సమావేశం తర్వాత ఈ ప్రకటన చేయడం గమనార్హం.
వరల్డ్‌కప్ గురించి జనవరి 30(శుక్రవారం)న లేదా ఫిబ్రవరి 2 సోమవారం తాము నిర్ణయం తీసుకుంటామని పీసీబీ తెలిపింది. ఆదివారం ప్రధానితో నఖ్వీ భేటీ అనంతరం ఇండియాతో మ్యాచ్ బాయ్‌కాట్ చేస్తున్నామని ప్రకటించింది ప్రభుత్వం. పాక్ సర్కార్ నిర్ణయంపై ఐసీసీ, బీసీసీఐ ఎలా స్పందిస్తాయో చూడాలి. షెడ్యూల్ ప్రకారం గ్రూప్ ఏలో ఉన్న పాకిస్థాన్ ఫిబ్రవరి 7న ఆరంభ పోరులో నెదర్లాండ్స్‌తో తలపడనుంది. అనంతరం ఫిబ్రవరి 10న అమెరికాతో, ఆపై టీమిండియాతో ఫిబ్రవరి 15న, ఫిబ్రవరి 18న నమీబియాతో పాక్ ఆడనుంది.
పహల్గాంలో ఉగ్రదాడిని నిరసిస్తూ.. వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్(WCL)లో యువరాజ్ సింగ్ (Yuvraj Singh)సారథ్యంలోని ఇండియా ఛాంపియన్స్ పాక్ జట్టుతో మ్యాచ్‌లను బాయ్‌కాట్ చేసింది. లీగ్ దశ మ్యాచ్‌తో పాటు సెమీస్ కూడా దాయాదితో ఆడలేదు.