Asia Cup Final : పదిహేడో సీజన్ ఆసియా కప్ (Asia Cup 2025) ఫైనల్ మ్యాచ్‌కు మరికాసేపట్లో తెరలేవనుంది. 40 ఏళ్ల టోర్నీ చరిత్రలో భారత్, పాకిస్థాన్ జట్లు టైటిల్ పోరులో తలపడడం ఇదే మొదటిసారి. దాంతో.. దాయాదుల మధ్య పైచేయి ఎవరిదయ్యేను? అని అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. ఇరుదేశాల ఆటగాళ్లు, అభిమానుల మధ్య భావోద్వేగాలతో ముడిపడిన ఈ మ్యాచ్‌కు భారీ భద్రత కల్పిస్తున్నారు. బిగ్ ఫైట్‌కు వేదికైన దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియాన్ని ఇప్పటికే తమ గుప్పిట్లోకి తీసుకున్నామని దుబాయ్ ఈవెంట్స్ సెక్యూరిటీ కమిటీ వెల్లడించింది. అంతేకాదు స్టేడియానికి వచ్చే అభిమానులకు కీలక ఆదేశాలు జారీ చేసిందీ సంస్థ.
చిరకాల ప్రత్యర్ధులైన భారత్ పాకిస్థాన్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ రాత్రి 8:00 గంటలకు టాస్ వేయనున్నారు. అనంతరం 30 నిమిషాల్లో తొలిబంతి పడనుంది. దాంతో.. ప్రశాంత వాతావరణంలో మ్యాచ్ నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు భద్రతా బలగాలు. హై ఓల్టేజ్ మ్యాచ్‌లో ఇరు దేశాల అభిమానులు హద్దు దాటకుండా చూసేందుకు కొన్ని కీలక సూచనలు, జాగ్రత్తలు పాటించాలని కోరింది. అవేంటంటే..
మ్యాచ్ సమయం రాత్రి 8:30 కాబట్టి అభిమానులు మూడు గంటల ముందే స్టేడియానికి చేరుకోవాలి. ఒకే టికెట్‌కు ఒకరినే అనుమతిస్తారు. మ్యాచ్ మధ్యలో బయటకువెళ్లిన వాళ్లను తిరిగి లోపలికి అనుమతించరు. నిర్వాహకులు, భద్రతా దళాలు సూచించిన జాగ్రత్తలను విధిగా పాటించాలి. వాహనాలను పార్కింగ్ ప్రదేశంలోనే నిలపాలి. అలానే దారికి అడ్డంగా.. రోడ్డు మధ్యలో వాహనాల్ని పార్క్ చేయరాదు. నిషేధిత వస్తువులను స్టేడియంలోకి తీసుకెళ్లరాదు.
టపాసులు, లేజర్ పాయింటర్స్‌తో పాటు పేలుడు పదార్థాలు, హానికరమైన వస్తువులను స్టేడియం లోపలికి అనుమతించరు. కత్తి, బ్లేడ్ వంటి పదునైన వస్తువులు.. విష పదార్థాలు, రిమోట్‌తో కంట్రోల్ చేయగలిగే పరికరాలను తీసుకెళ్లకూడదు. పెద్ద గొడుగులు, కెమెరా ట్రైపాడ్స్, సెల్ఫీ కర్రలు తీసుకెళ్లడంపై నిషేధం ఉంది. నిర్వాహకులు అనుమతించని బ్యానర్లు, జెండాలు, సంజ్ఞలతో కూడిన వస్తువులను తీసుకెళ్లకూడదు. అలానే.. పెంపుడు జంతువులు, సైకిళ్లు, స్కేట్‌బోర్డులు, స్కూటర్లు, గాజు పదార్థాలను నిషేధించారు.