Neeraj Chopra : ఒలింపిక్స్‌లో వరుసగా రెండోసారి పతక గర్జన చేసిన నీరజ్ చోప్రా(Neeraj Chopra) బ్రేక్ తీసుకోవడం లేదు. విశ్వ క్రీడల్లో పతకంతో మెరిసిన అతడు మరో టోర్నీకి సిద్దమవుతున్నాడు. పారిస్ జావెలిన్ త్రో పోటీల్లో రజతం కొల్లగొట్టిన నీరజ్ సర్జరీ వార్తలను తోసిపుచ్చాడు. త్వరలో జరుగబోయే లసాన్నే డైమండ్ లీగ్ (Lausanne Diamond League)లో ఆడడంపై నెలకొన్న ఉత్కంఠకు తెరదించాడు.
ప్రస్తుతం స్విట్జర్లాండ్‌లో శిక్షణ పొందుతున్నఅతడు ఈ టోర్నీలో పాల్గొంటున్నట్టు వెల్లడించాడు. ‘లసాన్నే డైమండ్ లీగ్ బరిలో నిలవాలని నిర్ణయం తీసుకున్నా. ఆగస్టు 22 నుంచి టోర్నీ ఆరంభం కానుంది. అదృష్టవశాత్తూ పారిస్ ఒలింపిక్స్ సాఫీగా సాగాయి.
ఇక నా గాయంతో ఇప్పుడు పెద్దగా ఇబ్బందేమీ లేదు. అందుకని ఈ సీజన్లో డైమండ్ లీగ్‌లో పోటీ పడాలని అనుకున్నా. అనంతరం గాయానికి ట్రీట్మెంట్పై వైద్యుల సలహా తీసుకుంటా. సెప్టెంబర్ ముగిశాక భారత్ వస్తాను. అప్పుడే గజ్జల్లో గాయం గురించి డాక్టర్‌ను సంప్రదిస్తాను’ అని నీరజ్ చోప్రా తెలిపాడు.
#WATCH | On his plans post his Olympic stint, Neeraj Chopra says, “… I have finally decided to participate in the Lausanne Diamond League, which begins August 22.” pic.twitter.com/euMxssIYak
— ANI (@ANI) August 17, 2024
టోక్యో ఒలింపిక్స్‌లో చరిత్ర సృష్టించిన నీరజ్ అథ్లెటిక్స్‌లో భారత్‌కు తొలి స్వర్ణం అందించాడు. మూడేండ్ల తర్వాత అదే ఉత్సాహంతో పారిస్ విశ్వ క్రీడల్లోనూ వెండి వెలుగులు విరజిమ్మాడు. క్వాలిఫయింగ్ రౌండ్లో నీరజ్ అంచనాలను అందుకున్నాడు. 89.34 మీటర్లతో అందరిని వెనక్కి నెట్టి ఫైనల్‌కు దూసుకెల్లాడు. పసిడి పోరులో అతడు శక్తినంత కూడదీసుకొని ఈటెను 89. 45మీటర్ల దూరం విసిరాడు. అర్షద్ నదీమ్(పాక్) 92.97 మీటర్లతో అగ్రస్థానంలో నిలవగా.. రెండో స్థానం దక్కించుకొని వరుసగా రెండో పతకంతో దేశం తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు.