పుణె: సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ కేంద్ర మంత్రి, భారత ఒలింపిక్ సంఘం మాజీ అధ్యక్షుడు సురేశ్ కల్మాడీ(Suresh Kalmadi) కన్నుమూశారు. ఆయన వయసు 81 ఏళ్లు. పుణెలో ఆయన తుది శ్వాస విడిచారు. సుదీర్ఘకాలం నుంచి ఆయన తీవ్ర అనారోగ్యంగా ఉన్నారు. పుణెలోని దీనానాథ్ మంగేస్కర్ ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందారు. ఇవాళ మధ్యాహ్నం రెండు గంటల వరకు ఆయన పార్దీవదేహాన్ని ఎరండ్వేన్లో ఉన్న కల్మాడీ ఇంట్లో సందర్శనకు పెట్టనున్నారు. వైకుంఠ శ్మశానభూమిలో మధ్యాహ్నం 3.30 నిమిషాలకు అంత్యక్రియలు నిర్వహిస్తారు.
సురేశ్ కల్మాడీకి భార్య, కుమారుడు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. రైల్వేశాఖ సహాయ మంత్రిగా కల్మాడీ చేశారు. భారతీయ ఒలింపిక్ సంఘం అధ్యక్షుడిగా కీలక బాధ్యతలు నిర్వర్తించారు. పుణెలో ఆయన పాపులర్ పొలిటికల్ లీడర్. అనేక సార్లు ఆ సిటీ నుంచి ఆయన లోక్‌సభకు ఎన్నికయ్యారు. రాజకీయాల్లోనే ఉన్నా.. ఆయన క్రీడా నిర్వాహణకు అంకితమయ్యారు. జాతీయ స్థాయిలో ఎన్నో క్రీడా కార్యక్రమాలను నిర్వహించారు.
భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షుడిగా 1996 నుంచి 2011 వరకు చేశారాయన. ఆ సంఘానికి సుదీర్ఘ కాలం సేవలందించిన వ్యక్తిగా ఆయన నిలిచారు. 1944లో కల్మాడీ జన్మించారు. భారతీయ వైమానిక దళంలో ఆయన ఫైటర్ పైలెట్‌గా చేశారు. 1965, 1971 యుద్ధాల్లో ఆయన పాల్గొన్నారు. రాజకీయాలు, క్రీడా నిర్వహణ రంగాల్లోకి రాకముందే ఆయన ఎన్నో కీలక హోదాల్లో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ తరపున ఆయన పుణె లోక్‌సభ నియోజకవర్గానికి ఎన్నికయ్యారు. కేంద్ర మంత్రిగా చేశారు.
భారత, అంతర్జాతీయ క్రీడా రంగాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షుడిగా కల్మాడీ ఉన్న సమయంలోనే.. క్రీడల్లో దేశ ఖ్యాతి మరింత ఇనుమడించింది. ఏషియన్ అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా కూడా చేశారు. ఐఏఏఎఫ్ కౌన్సిల్ సభ్యుడిగా ఉన్నారు. భారత్‌లో అత్యంత శక్తివంతమైన క్రీడా నిర్వాహకుడిగా ఆయనకు గుర్తింపు ఉన్నది.
కల్మాడీ ఐఏఓ ప్రెసిడెంట్‌గా ఉన్న సమయంలోనే 2008లో బీజింగ్ ఒలింపిక్స్‌లో ఇండియాకు గోల్డ్ మెడల్ వచ్చింది. ఆ ఈవెంట్లో షూటర్ అభివన్ బింద్రాకు స్వర్ణ పతకం దక్కింది. 2010లో ఢిల్లీలో జరిగిన కామన్వెల్త్ క్రీడలకు ఆర్గనైజింగ్ కమిటీ చైర్మెన్‌గా చేశారు.