England Cricket : స్వదేశంలో శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు ముందు ఇంగ్లండ్‌కు పెద్ద షాక్. ఆ జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ (Ben Stokes) గాయంతో సిరీస్‌కు దూరం అయ్యాడు. దాంతో, వైస్ కెప్టెన్‌గా ఎంపికైన ఓలీ పోప్(Ollie Pope)ను సెలెక్టర్లు కెప్టెన్‌గా ప్రకటించారు. దాంతో, సుదీర్ఘ ఫార్మాట్లో ఇంగ్లీష్ జట్టును నడిపించనున్న 82వ ఆటగాడిగా పోప్ రికార్డు సాధించనున్నాడు.
అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు ఫస్ట్ క్లాస్ క్రికెట్లోనూ సారథిగా అనుభవంలేని పోప్‌కి శ్రీలంక సిరీస్ పెద్ద పరీక్ష కానుంది. అయితే.. భారత పర్యటనలో ఉప్పల్ టెస్టు (Uppal Test)లో వీరోచిత సెంచరీతో జట్టును గెలిపించిన పోప్.. లంకపై కూడా చెలరేగాలని భావిస్తున్నాడు. ఇంగ్లండ్, లంకల మధ్య ఓల్డ్ ట్రఫోర్డ్ స్టేడియంలో ఆగస్టు 21న తొలి టెస్టు జరుగనుంది.
ఇంగ్లండ్ సరీస్ కోసం లంక పక్కాగా సిద్ధమవుతోంది. ఇంగ్లండ్ దిగ్గజం ఇయాన్ బెల్ (Ian Bell)ను బ్యాటింగ్ కోచ్‌గా నియమించుకుంది. స్వదేశీ పిచ్‌లపై సుదీర్ఘ అనుభవమున్న బెల్.. పోప్ బృందాన్ని ఓడించేందుకు లంకకు ఎంతవరకు ఉపయోగపడతాడో చూడాలి. ఆగస్టు 21వ తేదీన మాంచెస్టర్‌లో తొలి మ్యాచ్ జరుగనుంది. అనంతరం ఆగస్టు 29న రెండో టెస్టు లార్డ్స్ (Lords)లో, సెప్టెంబర్ 6న ఓవల్ మైదానంలో మూడో టెస్టు నిర్వహించనున్నారు. ఈ సిరీస్ కోసం 18మందితో కూడిన స్క్వాడ్‌ను లంక సెలెక్టర్లు ఇప్పటికే ప్రకటించారు.