Nitish Kumar Reddy : ఆస్ట్రేలియా పర్యటనలో అరంగేట్రం ఏ క్రికెటర్‌కు అయినా మర్చిపోలేని అనుభవం. పేస్‌తో వణికించే కంగారూ బౌలింగ్ దళాన్ని ఎదుర్కొని రెండంకెల స్కోర్ చేసినా సంతృప్తి చెందాల్సిందే. అలాంటిది జట్టు పీకల్లోతు కష్టాల్లో ఉన్నప్పుడు క్రీజులో నిలబడడం.. ప్రపంచ స్థాయి పేస్ దళాన్ని కకావికలం చేస్తూ పరుగులు సాధించడమంటే మాటలు కాదు. కానీ, తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి (Nitish Kumar Reddy) అరంగేట్రం టెస్టులో.. అది కూడా ఆసీస్ గడ్డపై ఖతర్నాక్ ఇన్నింగ్స్ ఆడి టీమిండియా టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఒకప్పుడు వీవీఎస్ లక్ష్మణ్ (VVS Laxman) కంగారూ నేలపై కదం తొక్కితే.. ఇప్పుడు నేనున్నానంటూ నితీశ్ రెచ్చిపోయి ఆడాడు.
కాన్పూర్ వేదికగా టీ20ల్లో అరంగేట్రం చేసిన తెలుగు కుర్రాడు నితీశ్‌కు పెర్త్ టెస్టులో అనూహ్యంగా చోటు దక్కింది. పేస్ ఆల్‌రౌండర్ అయిన అతడు తన రాకను ఘనంగా చాటుతూ 41 పరుగుల విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. ఆసీస్ పేసర్ జోష్ హేజిల్‌వుడ్ ధాటికి స్టార్ ఆటగాళ్లు డగౌట్ చేరిన వేళ క్రీజులోకి వచ్చిన నితీశ్ పట్టుదలతో ఆకట్టుకున్నాడు. రిషభ్ పంత్‌తో కలిసి కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు.
Nitish Reddy is looking like a million bucks on his debut Test match.#NitishKumarReddy #AUSvsIND #BGT2025pic.twitter.com/8mFEnSAnUI
— India Today Sports (@ITGDsports) November 22, 2024
జట్టు స్కోర్ 150 వచ్చేంత వరకూ కంగారూ పేసర్లను దీటుగా ఎదుర్కొన్న అతడు కమిన్స్ ఓవర్లో చివరి వికెట్‌గా ఔటయ్యాడు. నితీశ్ గనుక పోరాడకుంటే టీమిండియా అంతకంటే తక్కువకే ఆలౌటయ్యేది. స్క్వాడ్‌లోని పలువురిని కాదని తనకు అవకాశం ఇచ్చిన కోచ్, కెప్టెన్ల నమ్మకాన్ని నితీశ్ నిజం చేశాడు.
క్రికెటర్ అవ్వాలనే కలను నిజం చేసుకున్న నితీశ్‌కుమార్ ఆరంభం నుంచే అదరగొడుతున్నాడు. అతడి తండ్రి ముత్యాల రెడ్డి త్యాగ ఫలితమే దేశానికి ఓ యువ క్రికెటర్‌ను అదించిందనే విషయం చాలా కొద్దిమందికే తెలుసు. అవును.. కుమారుడు దేశం తరఫున ఆడుతుంటూ చూడాలని ఆశ పడిన ముత్యాల రెడ్డి ప్రభుత్వ ఉద్యోగాన్ని సైతం వదులుకున్నాడు.
తండ్రి త్యాగాన్ని మర్చిపోని నితీశ్.. అవకాశాల్ని అందిపుచ్చుకుంటూ టీమిండియా జెర్సీ ధరించాడు. బంగ్లాదేశ్‌పై రెండో టీ20లో మెరుపు బ్యాటింగ్‌తో అలరించిన నితీశ్.. ఆ తర్వాత బంతితోనూ విజృంభించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. తొలి సిరీస్‌లోనే ఒంటిచేత్తో జట్టును గెలిపించడం.. ఏ క్రికెటర్‌కైనా చిరస్మరణీయమే కదా.
NITISH KUMAR REDDY – The brute force of six hitting. 🥶 pic.twitter.com/UtDAfXbbiI
— Johns. (@CricCrazyJohns) October 9, 2024
ఐపీఎల్ హీరోగా భారత జట్టులోకి వచ్చిన నితీశ్ వాళ్లది విశాఖపట్టణం. తండ్రి ముత్యాల రెడ్డి అక్కడే హిందూస్థాన్ జింక్ కంపెనీలో ఉద్యోగం చేసేవాడు. నితీశ్ ఐదేండ్ల వయసు నుంచే బ్యాట్ అందుకున్నాడు. అంతేకాదు తండ్రితో కలిసి తరచూ హిందూస్థాన్ జింక్‌కు వెళ్లేవాడు. అక్కడ మైదానంలో క్రికెట్ ఆడుతున్న సీనియర్లను గమనించేవాడు. అలా.. కుమారుడి ఇష్టాన్ని తెలుసుకున్న ముత్యాల రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నాడు. రాజస్థాన్‌కు బదిలీ అవడంతో తన బిడ్డ కెరీర్ కంటే ప్రభుత్వ ఉద్యోగం ముఖ్యం కాదని రాజీనామా చేశాడు.
ఐపీఎల్ 17వ సీజన్లో నితీశ్ కుమార్ పేరు మార్మోగిపోయింది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌లో ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్‌ల తరహాలో దూకుడుగా ఆడుతూ.. బంతితోనూ ప్రత్యర్థిని దెబ్బకొట్టగల యువకెరటం దొరికాడంటూ అభిమానులు మురిసిపోయారు. ఆల్‌రౌండర్‌గా రాణించిన నితీశ్ త్వరలోనే దేశం తరఫున ఆడడం ఖాయం అనుకున్నారంతా. అనుకున్నట్టే. టీ20 వరల్డ్ కప్ తర్వాత జింబాబ్వే పర్యటనకు నితీశ్‌కు పిలుపొచ్చింది. అయితే.. గాయం కారణంగా అతడు దూరమయ్యాడు.
” Daddy! All the best baa Adu 🥹 ”
Nitish Kumar Reddy’s father Mutayala Reddy has a special message for his son 🧡#OrangeArmy #BGT2025 #INDvsAUS pic.twitter.com/JwsfMvD311
— Sunrisers Army (@srhorangearmy) November 22, 2024
ప్రతిభగల అతడికి మరో అవకాశం ఇద్దామని బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు ఎంపిక చేశారు సెలెక్టర్లు. కాన్పూర్‌లో డెబ్యూట్ క్యాప్ అందుకున్న నితీశ్ తొలి మ్యాచ్‌లో ఫర్వాలేదనిపించినా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో బంగ్లాదేశ్ బౌలర్లను ఉతికారేశాడు. తెలుగోడి తెగువ చూపిస్తూ తొలి అర్ధ శతకంతో వారెవ్వా అనిపించాడు. అంతేకాదు.. బౌలింగ్‌లోనూ రెండు కీలక వికెట్లు తీసి ఆల్‌రౌండర్‌గా తన ఆగమనాన్ని ఘనంగా చాటాడు.