Dead body wakes up : అతడు అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరాడు. వైద్యులు చికిత్స చేశారు. తర్వాత చనిపోయాడని ధృవీకరించారు. రెండు గంటలపాటు ఫ్రీజర్‌లో పెట్టారు. ఆపై మృతదేహాన్ని సంబంధీకులకు అప్పగించారు. వారు ఆ మృతదేహాన్ని అంత్యక్రియల కోసం శ్మశానానికి తరలించారు. మరి కాసేపట్లో చితికి నిప్పుపెడుతారనగా డెడ్ బాడీ లేచి కూర్చుంది. దాంతో అంత్యక్రియలకు హాజరైన భయంతో వణికిపోయారు. తర్వాత తేరుకుని ఆస్పత్రికి తరలించారు. రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో ఈ విచిత్ర ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. జైపూర్‌కు చెందిన 25 ఏళ్ల మూగ, చెవిటి యువకుడు రోహితాష్ ఒక అనాథ. నగరంలోని ఓ అనాథాశ్రమంలో అతను ఉంటున్నాడు. ఈ క్రమంలో గురువారం మధ్యాహ్నం రోహితాష్ అస్వస్థతకు గురయ్యాడు. దాంతో ఆశ్రమ సిబ్బంది అతడిని జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వైద్యం చేసిన డాక్టర్లు మధ్యాహ్నం రెండు గంటల సమయంలో రోహితాష్ మరణించాడని ధృవీకరించారు.
ఆ తర్వాత ఫార్మాలిటీస్ పూర్తయ్యే వరకు రెండు గంటలపాటు మృతదేహాన్ని ఫ్రీజర్‌లో పెట్టారు. ఆ తర్వాత ఆశ్రమ నిర్వాహకులకు అప్పగించారు. ఆశ్రమ నిర్వాహకులు అంబులెన్స్‌లో మృతదేహాన్ని అంత్యక్రియలకు తరలించారు. అక్కడ కొద్దిసేపైతే చితికి నిప్పుపెడుతారనగా రోహితాష్ లేచి కూర్చున్నాడు. దాంతో ఒక్కసారిగా అందరూ భయాందోళనకు గురయ్యారు. తర్వాత అతడిని అదే జిల్లా ఆస్పత్రికి తరలించారు.
వెంటనే వైద్యులు చికిత్స ప్రారంభించారు. చికిత్స పొందుతూనే ఇవాళ (శుక్రవారం) ఉదయం ప్రాణాలు కోల్పోయాడు. దాంతో ఈ మధ్యాహ్నం అంత్యక్రియలు పూర్తిచేశారు. కాగా ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ సీరియస్ అయ్యారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన నలుగురు వైద్యులను సస్పెండ్ చేశారు. మృతదేహానికి పోస్టుమార్టం చేస్తే లేచి కూర్చునే ఛాన్స్ ఎక్కడిదని, పోస్టు మార్టం చేయకుండానే రిపోర్టు ఎలా ఇచ్చారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనపై విచారణకు ఆదేశించారు.