న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కి చెందిన సీఎం అతిషిని లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ప్రశంసించారు. (Delhi Lt Governor’s rare praise) మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కంటే ఆమె వెయ్యి రెట్లు బెటర్ అని అన్నారు. ఇందిరా గాంధీ ఢిల్లీ టెక్నికల్ యూనివర్శిటీ ఫర్ ఉమెన్ ఏడవ స్నాతకోత్సవం శుక్రవారం జరిగింది. ఇందులో పాల్గొన్న లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా మహిళా విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా సీఎం అతిషిని ఆయన ప్రశంసించారు. ‘ఢిల్లీ సీఎం మహిళ కావడం పట్ల ఇవాళ సంతోషంగా ఉన్నా. బహుశా ముందున్న సీఎం (అరవింద్ కేజ్రీవాల్) కంటే ఆమె వెయ్యి రెట్లు మెరుగ్గా ఉన్నారని నేను నమ్మకంగా చెబుతున్నా’ అని అన్నారు.
కాగా, ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరెస్టై బెయిల్పై బయటకొచ్చిన అరవింద్ కేజ్రీవాల్ ఈ ఏడాది సెప్టెంబర్లో సీఎం పదవికి రాజీనామా చేశారు. అతిషిని సీఎంగా ఎంపిక చేశారు. అయితే తన నిజాయితీని ఎన్నికల్లో నిరూపించుకుంటానని కేజ్రీవాల్ తెలిపారు. తనపై వచ్చిన అవినీతి ఆరోపణలపై ప్రజల తీర్పు కోరతానని ఆయన అన్నారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత సీఎం పదవి చేపడతానని స్పష్టం చేశారు.