ENG vs SL : మూడో టెస్టులో శ్రీలంక అద్భుత విజయం సాధించింది. వరుసగా రెండు టెస్టుల్లో ఓటమిని దిగమింగి భారీ విజయంతో ఇంగ్లండ్(England)కు షాకిచ్చింది. కెన్సింగ్టన్ ఓవల్‌లో ఇంగ్లండ్ బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న పథుమ్ నిశాంక (127 నాటౌట్: 124 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్సర్లు) శతకంతో గర్జించాడు. సీనియర్ ఆల్‌రౌండర్ ఏంజెలో మాథ్యూస్(32 నాటౌట్) పట్టువదలని విక్రమార్కుల్లా పోరాడాడు. దాంతో, తొలి రెండు టెస్టుల్లో ఓటమికి లంక బదులు తీర్చుకుంది. 8 వికెట్ల తేడాతో జయభేరి మోగించి సిరీస్‌లో బోణీ కొట్టింది.
ఇంగ్లండ్ పర్యటనలో శ్రీలంక వైట్‌వాష్ తప్పించుకుంది. తొలి రెండు మ్యాచుల్లో కనీస పోటీ ఇవ్వలేకపోయిన లంక మూడో మ్యాచ్‌లో చెలరేగింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్.. మూడు విభాగాల్లో ఆతిథ్య జట్టును తోసిరాజని సంచలన విజయం నమోదు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ను 325కే కట్టడి చేసిన లంక.. రెండో ఇన్నింగ్స్‌లో పంజా విసిరింది. ఆతిథ్య జట్టును 156 పరుగులకే ఆలౌట్ చేసింది. లహిరు కుమార(4/21), విశ్వ ఫెర్నాండో(3/40)లు సూపర్ స్పెల్‌తో ఇంగ్లండ్ బ్యాటర్ల ఆట కట్టించారు. దాంతో, లంక మ్యాచ్‌పై పట్టు బిగించింది.
Take a bow, Pathum Nissanka 🏅 #ENGvSL pic.twitter.com/W6Z4IMf0Z1
— ESPNcricinfo (@ESPNcricinfo) September 9, 2024
స్వల్ప ఛేదనలో లంక ఓపెనర్ పథుమ్ నిశాంక(127 నాటౌట్: 124 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్సర్లు) సాధికారిక ఇన్నింగ్స్ ఆడాడు. కుశాల్ మెండిస్(39), ఏంజెలో మాథ్యూస్(32 నాటౌట్)తో కలిసి జట్టును విజయ తీరాలకు చేర్చాడు. తొలి రెండు టెస్టుల్లో గెలుపొందిన ఇంగ్లండ్ 2-1తో సిరీస్ కైవసం చేసుకుంది. అద్బుత శతకంతో లంకను గెలిపించిన పథుమ్ నిశాంక ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా ఎంపికయ్యాడు. లార్డ్స్ టెస్టులో రెండు సెంచరీలతో చెలరేగిన జో రూట్, కమిందు మెండిస్‌లు ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు అందుకున్నారు.