యెన్ బాయి: వియత్నాంలో టైఫూన్ యాగి(Typhoon Yagi) తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. ఉత్తర వియత్నాంలో ఉన్న ఓ బిజీ బ్రిడ్జ్ .. ఆ తుఫాన్ ధాటికి కూలిపోయింది. దీంతో బ్రిడ్జ్ మీద ఉన్న పది కార్లు, రెండు స్కూటర్లు ఆ నీటిలో కొట్టుకుపోయాయి. ఎరుపు నదిలో ఆ బ్రిడ్జ్ కూలినట్లు ప్రధాని హో డుక్ ఫోక్ తెలిపారు. ఫూ తూ ప్రావిన్సులో ఉన్న ఆ బ్రిడ్జ్‌ను ఫాంగ్ చావు బ్రిడ్జ్‌గా పిలుస్తారు. ముగ్గుర్ని రక్షించగా, మరో 13 మంది మిస్సింగ్‌లో ఉన్నారు. దాదాపు 375 మీటర్ల పొడుగు ఉన్న ఆ బ్రిడ్జ్‌లో ఇంకా కొంత భాగం అలాగే ఉన్నది. బ్రిడ్జ్‌ను వీలైనంత త్వరగా నిర్మించాలని ఆర్మీని ఆదేశించినట్లు ప్రధాని హో తెలిపారు.
టైఫూన్ యాగి.. ఈ ఏడాది ఆసియాను తాకిన అత్యంత శక్తివంతమైన తుఫాన్‌గా రికార్డుకెక్కింది. శనివారం ఆ తుఫాన్ వియత్నంలోకి ఎంటర్ అయ్యింది. ఇప్పటి వరకు 59 మంది మరణించారు. సుమారు 203 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. తుఫాన్ కాస్త అల్పపీడనంగా మారినా.. వరదలు, కొండచరియలు విరిగిపడే అవకాశాలు ఉన్నట్లు అధికారులు హెచ్చరించారు. యెన్ బాయి ప్రావిన్సులో మూడు ఫీట్ల ఎత్తును నీరు ప్రవహిస్తున్నది. వియత్నాం తీరు ప్రాంత ప్రజలను సుమారు 50 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 12 ప్రావిన్సుల్లో స్కూళ్లను తాత్కాలికంగా మూసివేశారు.