Nikhat Zareen : ఒలింపిక్స్‌లో పక్కా పతకం సాధిస్తుందనుకున్న స్టార్ బాక్సర్ నిఖత్ జరిన్ (Nikhat Zareen) ఖాళీ చేతులతోనే స్వదేశం వచ్చింది. ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన నిఖత్ విశ్వ క్రీడ (Olympics)ల్లో తన పంచ్ పవర్ చూపించలేక నిరాశపరిచింది. అనూహ్యంగా తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టింది. ప్రపంచ చాంపియన్‌షిప్ గెలుపొందిన ఇందూరు బిడ్డ ఒలింపిక్స్ మెడల్‌ను మాత్రం అందుకోలేకపోయింది. పారిస్‌లో విశ్వ క్రీడలు ముగిసిన మరునాడే ఈ యువ బాక్సర్ తన బాధను ‘ఎక్స్’ పోస్ట్ ద్వారా వెల్లడించింది.
జీవితం మొత్తాన్ని బాక్సింగ్‌కే కేటాయించానని, ఒలింపిక్స్ ఫలితాన్ని జీర్ణించుకోవడం చాలా కష్టంగా ఉందని నిఖత్ తెలిపింది. ‘పారిస్ ఒలింపిక్స్ ముగిసిన సందర్భంగా చాంపియన్‌గా నిలిచిన నా ప్రత్యర్థి వూ యూకి అభినందనలు తెలియజేస్తున్నా. జీవిత ప్రయాణాన్ని అంగీకరించడం మాకు ఇప్పుడు చాలా కష్టంగా అనిపిస్తోంది. విజయాలు, ఓటములు, తప్పులు, అయోమయ పరిస్థితులు.. ఇవన్నీ అందులో భాగమే. ఒకే లక్ష్యం కోసం జీవితం మొత్తాన్ని అంకితం చేశాక ఫలితాన్ని అంగీకరించడం చాలా కష్టంగా ఉంది. మది నిండా సందేహాలు నెలకొన్న ఈ సమయంలో నేనొక విషయం నేర్చుకున్నా.
As the Paris Olympics 2024 wraps up, I want to congratulate my opponent, Wu Yu, who has become the Olympic champion.
Accepting life’s journey means embracing all parts of ourselves: the wins, the losses, the mistakes, the confusion, and everything in between. After dedicating… pic.twitter.com/6ucVk0XPbC
— Nikhat Zareen (@nikhat_zareen) August 12, 2024
జీవితమనేది ఊహకందనిది. ఇది మన ఎదుగుదలతో ఓ భాగం. అన్ని ప్రశ్నలకు ఒకేసారి సమాధానాలను లేకపోవడం కూడా మంచిదే. ఒకవేళ నేను నిన్న చాలా సంతోషంగా ఉంటే.. ఈరోజు ఓడిపోయినా పెద్దగా బాధపడను. ఎందుకంటే నేను మనిషినే. అల్లా నాకోసం ఏమి ప్లాన్ చేశాడో అదే నాకు అత్యుత్తమం. నేను అనుకున్న విధంగా అన్ని జరగవు అనే సత్యాన్ని నమ్మడం అలవాటు చేసుకుంటున్నా. ఆ దేవుడు అనుకున్నట్టే అన్నీ అవుతాయి. ఎందుకంటే ఆయనే కదా బెస్ట్ ప్లానర్. ఇప్పటికైతే నేను జీవిత ప్రయాణాన్ని ఆస్వాదిస్తా. వచ్చే ఒలింపిక్స్ మీద దృష్టి పెడుతా అని నిఖత్ తన పోస్ట్‌లో రాసుకొచ్చింది.
నిజామాబాద్‌కు చెందిన నిఖత్ 50 కిలోల విభాగంలో ఒలింపిక్స్ బరిలో నిలిచింది. ఒలింపిక్ ట్రయల్స్‌లో దిగ్గజ బాక్సర్ మేరీ కోమ్‌ను ఓడించిన ఆమె ఈసారి పతకం గెలవడం ఖాయం అనిపించింది. కానీ, అంచనాలు తప్పాయి. అయితే.. తొలి రౌండ్లోనే ఆమెకు చైనా బాక్సర్ వూ యూ (Wu Yu) చెక్ పెట్టింది. దాంతో, పోటీ పడేందుకు 50 కిలోల నిర్ణీత బరువు ఉండేందుకు నిఖత్ రెండు రోజులుగా పడ్డ శ్రమ అంతా వృథా అయింది.