Arshad Nadeem : ఒలింపిక్స్‌లో పాకిస్థాన్ జెండాను సగర్వంగా ఎగురవేసిన అర్షద్ నదీమ్ (Arshad Nadeem) స్వదేశంలో హీరో అయ్యాడు. స్వదేశంలో ఈ బడిసె వీరుడు సన్మానాలు, సత్కారాలతో బిజీ అయిపోయాడు. విశ్వ క్రీడల్లో స్వర్ణంతో చరిత్ర సృష్టించిన జావెలిన్ త్రోయర్‌పై కాసుల వర్షం కురుస్తోంది. ఇప్పటికే పాక్ ఆటగాడు కోటి ఆఫర్ చేయగా.. పాక్ – అమెరికన్ వ్యాపారవేత్త అలీ షెకానీ (Ali Sheikhani) సైతం ముందకొచ్చి నదీమ్‌కు సుజికీ ఆల్టో కారును బహుమతిగా ఇస్తానన్నాడు.
తాజాగా పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రి మర్యమ్ షరీఫ్ (Maryam Sharif) ఒలింపిక్ విజేతకు రూ.3 కోట్లు ప్రకటించింది. అంతేకాదు విశ్వ క్రీడల్లో అతడు నెలకొల్పిన రికార్డుకు గుర్తుగా 92.97 అంకెల నంబర్ ప్లేట్‌తో ఉన్న కారును ఆమె బహుమతిగా ఇచ్చింది.
شاباش ارشد ندیم 🇵🇰 pic.twitter.com/0Da12Tip2k
— Maryam Nawaz Sharif (@MaryamNSharif) August 13, 2024
ఒలింపిక్స్ పసిడితో నదీమ్ జీవితం ఒక్కసారిగా మారిపోయింది. అప్పటిదాకా అతడికి పైసా సాయం చేయనివాళ్లు ఇప్పుడు ఏకంగా కోటి రూపాయలు ఇచ్చేందుకు ముందుకొస్తున్నారు. ఒకానొక దశలో బంధువులు, స్నేహితుల అండతో జావెలిన్ ఆటను కొనసాగించిన నదీమ్.. పట్టుదలతో ఒలింపిక్స్ గోల్డ్ మెడల్ కొల్లగొట్టాడు. దాంతో, పాక్‌లోని ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. ఒలింపిక్ విజేతగా అతడి ఘనతను పాక్ ప్రజలు వేనోళ్ల పొగుడుతున్నారు. అంతేకాదు పలువరు సెలబ్రిటీలు, సామాన్యులు సైతం నదీమ్‌కు ఆర్ధిక సాయం అందిస్తుండడం విశేషం.
పారిస్ ఒలింపిక్స్‌లో రికార్డు త్రోతో నదీమ్ స్వర్ణ పతకం కొల్లగొట్టాడు. ఫైనల్లో 92.97 మీటర్ల దూరం ఈటెను విసిరి పాక్‌కు తొలి పసిడిని అందించాడు. ఇక టోక్యో ఒలింపిక్స్‌లో పసిడిని ముద్దాడిన నీరజ్ (Neeraj Chopra) .. పారిస్‌లో రజతంతో సరిపెట్టుకున్నాడు. ఫైనల్లో భారత స్టార్ అథ్లెట్ 89.45 మీటర్ల దూరం బడిసెను విసిరి వరుసగా రెండో పతకంతో చరిత్ర లిఖించాడు.