Ajit Pawar | మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ (Ajit Pawar) కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవలే జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బారామతి స్థానం నుంచి సోదరి సుప్రియా సూలే (Supriya Sule)పై తన భార్య సునేత్ర పవార్‌ను ప్రత్యర్థిగా నిలబెట్టి తప్పు చేశానని వ్యాఖ్యానించారు. రాజకీయాలను ఇంటి వ్యవహారాల్లోకి రానివ్వకూడదన్నారు.
త్వరలో మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అజిత్ పవార్ రాష్ట్రవ్యాప్తంగా ‘జన సమ్మాన్ యాత్ర’ (Jan Samman Yatra) నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఓ న్యూస్ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా లోక్‌సభ ఎన్నికల్లో వదినా మరదళ్ల పోటీ అంశాన్ని ప్రస్తావించారు. తనకు తన సోదరీమణులంటే ఎంతో ఇష్టమని చెప్పారు. ఇంటి వ్యవహారాల్లోకి రాజకీయాలను రానివ్వకూడదని వ్యాఖ్యానించారు. ఇటీవలే జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో సోదరి సుప్రియా సూలేపై తన భార్య సునేత్రను పోటీకి దింపి తప్పు చేశానన్నారు. ఇలా జరిగి ఉండకూడదని.. ఎన్సీపీ పార్లమెంటరీ బోర్డు నిర్ణయం కారణంగా ఇలా చేయాల్సి వచ్చిందని వ్యాఖ్యానించారు.
ఈ ఇంటర్వ్యూలో భాగంగా వచ్చే వారం రక్షాబంధన్ సందర్భంగా సోదరి సుప్రియా సూలేను కలుస్తారా..? అని విలేకరులు అజిత్ పవార్‌ను ప్రశ్నించారు. అయితే, ప్రస్తుతం ఆమె వేరే పర్యటనలో ఉందని డిప్యూటీ సీఎం సమాధానమిచ్చారు. ఒకేచోట ఉంటే తప్పకుండా కలుస్తామని స్పష్టం చేశారు. అదేవిధంగా ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ (Sharad Pawar)పై మహారాష్ట్ర నేతలు విమర్శలు చేయడంపై కూడా అజిత్ పవార్ స్పందించారు. ఆయన సీనియర్ నేత మాత్రమే కాదని అన్నారు. తమ కుటుంబ పెద్ద అని చెప్పారు. ఆయనపై బీజేపీ, శివసేన, ఎన్సీపీ నేతలు విమర్శలు చేయడం సరికాదన్నారు.
‘రైతులు, మహిళలు, యువత, అభివృద్ధి, సంక్షేమ పథకాలపైనే నేను మాట్లాడాలనుకుంటున్నాను. నాపై వచ్చే విమర్శలకు స్పందించకూడదని నిర్ణయించుకున్నా. శరద్ పవార్ పార్టీ సీనియర్ నాయకుడేకాదు.. మా కుటుంబ పెద్ద. ఆయన నాపై చేసిన విమర్శల గురించి నేను మాట్లాడాలనుకోవట్లేదు. అయితే అధికార బీజేపీ, శివసేన శరద్ పవార్‌ను లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేయడం సరికాదు. ఈ విషయంలో కూటమి నేతలు కలిసి కూర్చున్నప్పుడు నా అభిప్రాయాన్ని తెలియజేస్తాను’ అని అజిత్ పవార్ పేర్కొన్నారు.
కాగా, శరద్ పవార్ సోదరుడి కుమారుడు అజిత్ పవార్ (Ajit Pawar) ఎన్సీపీని చీల్చి బీజేపీతో చేతులు కలిపిన విషయం తెలిసిందే. ఏక్నాథ్ షిండే ప్రభుత్వంలో చేరారు. దీంతో పవార్ కుటుంబంలో చీలికలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవలే జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో అజిత్ పవార్ తన భార్య సునేత్ర పవార్‌ను బారామతి నుంచి సోదరి సుప్రియా సూలేపై బరిలోకి దింపారు. ఈ క్రమంలో వదిన మరదలి మధ్య పోరుపై నియోజకవర్గంలో తీవ్ర స్థాయిలో చర్చ నడిచింది. ఇక ఆ ఎన్నికల్లో సుప్రియా సూలేనే గెలుపొందారు. తన వదినపై ఏకంగా 1.55 లక్షలకు పైగా ఓట్ల మెజారిటీతో తన స్థానాన్ని నిలబెట్టుకున్నారు. ఈ ఎన్నికల్లో సుప్రియా సూలేకి 7,32,312 ఓట్లు పోలవగా.. సునేత్రకు 5,73,979 ఓట్లు వచ్చాయి.
Also Read..
Tamil Nadu | ఇదేం పని..? ఫుట్‌బాల్ మ్యాచ్ ఓడిపోయారని విద్యార్థులను చితకబాదిన పీఈటీ టీచర్
Bengaluru | బ్రేక్ పెడల్ కిందకు వాటర్ బాటిల్.. అదుపుతప్పి వాహనాలపైకి దూసుకెళ్లిన బస్సు.. VIDEO
Baba Ramdev | రామ్ దేవ్ బాబాకు భారీ ఊరట.. ధిక్కరణ కేసును ముగించిన సుప్రీంకోర్టు