బాలీవుడ్ అగ్ర కథానాయిక శ్రద్ధాకపూర్ ఈ ఏడాది భారీ సినిమాల్లో భాగమవుతున్నది. ప్రస్తుతం ఆమె మరాఠీ నృత్యకారిణి, గాయని వితాబాయి జీవిత కథ ఆధారంగా రూపొందిస్తున్న ‘ఈఠా’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ‘ఛావా’ ఫేమ్ లక్ష్మణ్ ఊటేకర్ దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ సినిమా పూర్తయిన వెంటనే ఆమె ‘నాగిన్’ అనే సూపర్ నాచురల్ ఫిల్మ్‌లో నటించబోతున్నది. ఐదేళ్ల క్రితమే ఈ సినిమాకు బీజం పడింది. అయితే అనివార్య కారణాల వల్ల సెట్స్‌పైకి రాలేదు. తాజా సమాచారం ప్రకారం ఏప్రిల్‌లో ఈ సినిమా షూటింగ్ మొదలుకానుందని తెలిసింది. ఇందులో శ్రద్ధాకపూర్ నాగిని పాత్రలో కనిపించనుంది. భారీ గ్రాఫిక్స్ హంగులతో రూపొందే ఈ చిత్రంలో ఐకానిక్ నాగిని పాత్రను సరికొత్త పంథాలో ఆవిష్కరించబోతున్నట్లు తెలిసింది.