Nikitha Godishala | అడ్డగుట్ట, జనవరి 5 (నమస్తే తెలంగాణ): అమెరికాలో హైదరాబాద్ యువతి దారుణహత్యకు గురైంది. మాజీ ప్రియుడి చేతిలోనే అత్యంత కిరాతకంగా హతమైనట్టు తెలుస్తున్నది. నిఖిత తల్లిదండ్రులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్‌లోని మెట్టుగూడ విజయపురి కాలనీవాసి ఆనంద్‌కు ఇద్దరు కూతుళ్లు. పెద్ద కుమార్తె నిఖిత అమెరికాలోని కొలంబియాలో నాలుగేండ్లుగా ఉద్యోగం చేస్తూ అక్కడే నివసిస్తున్నది. ఈ నెల 2న నిఖిత కనిపించడంలేదంటూ ఆమె స్నేహితుడు అర్జున్‌శర్మ.. హోవార్డ్ ప్రాంత పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కొత్త సంవత్సరం వేడుకల్లో నిఖితను చివరిసారిగా చూశానని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఆ తర్వాత భారత్‌కు వచ్చేశాడు. కేసు దర్యాప్తు చేసిన పోలీసులు నిఖిత మృతదేహాన్ని అర్జున్‌శర్మ గదిలోనే గుర్తించారు. ఆమె శరీరంపై చాలా కత్తిపోట్లు ఉన్నట్టు వెల్లడించారు.
ఇంటర్‌పోల్ పోలీసులను అప్రమత్తం చేశారు. ఇంటర్‌పోల్ పోలీసులు అర్జున్శర్మను చెన్నైలో అరెస్ట్ చేశారు. హత్య ఎలా జరిగింది? కేసు పూర్వాపరాలేంటి? అనే విషయాలపై ఇంకా అధికారికంగా ఎలాంటి సమాచారం ఇంటర్‌పోల్, అమెరికా పోలీసుల నుంచి వెల్లడి కాలేదు. హైదరాబాద్‌లో సోమవారం నిఖిత తండ్రి మాట్లాడుతూ తన కూతురు నిఖితను అర్జున్శర్మనే హత్య చేశాడని ఆరోపించారు. అతడు నిఖిత ప్రియుడు కాదని, అతను చాలా మంది నుంచి అప్పులు తీసుకున్నాడని, నిఖిత వద్ద కూడా అప్పు చేశాడని చెప్పాడు. గతంలో తమ కూతురు, అర్జున్ ఒకే అపార్ట్మెంట్లో ఉండేవారని తెలిపారు. అవసరం నిమిత్తం అర్జున్‌కు కొంత డబ్బు ఇచ్చినట్టు నిఖిత తనకు చెప్పిందని వివరించారు. తీసుకున్న డబ్బులు తిరిగి ఇస్తానంటూ ఇంటికి పిలిచి హత్యచేశాడని ఆరోపించారు. కొత్త సంవత్సరం రోజు నిఖిత ఫోన్‌చేసి హ్యాపీ న్యూ ఇయర్ అంటూ మాట్లాడిందని, అంతలోనే హత్యకు గురైందని కన్నీటి పర్యంతమయ్యారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకొని నిఖిత మృతదేహాన్ని త్వరగా హైదరాబాద్‌కు తరలించాలని కోరారు.