మహేష్‌బాబు-రాజమౌళి కాంబినేషన్లో రూపొందుతున్న గ్లోబల్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ ‘వారణాసి’ ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. గత నెలలో హైదరాబాద్‌లో నిర్వహించిన గ్లోబ్‌ట్రాటర్ ఈవెంట్ సినిమాపై దేశవ్యాప్తంగా అంచనాలను పెంచింది. దాదాపు 1300కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నది. భారతీయ పురాణాల నేపథ్యంలో సాగే ఈ సాహసగాథను విజువల్ వండర్‌గా తెరపై ఆవిష్కరించేందుకు దర్శకధీరుడు రాజమౌళి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. హాలీవుడ్ నిపుణులు పనిచేస్తున్న ఈ సినిమాలోని కొన్ని సీక్వెన్స్ అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ప్రేక్షకులను అబ్బురపరుస్తాయని చెబుతున్నారు.
ఇదిలావుండగా ఈ సినిమా రిలీజ్‌పై గ్లోబ్‌ట్రాటర్ ఈవెంట్లోనే రాజమౌళి క్లారిటీ ఇచ్చారు. 2027 వేసవిలో ప్రేక్షకుల ముందుకుతీసుకొస్తామని చెప్పారు. తాజా సమాచారం ప్రకారం ‘వారణాసి’ విడుదల తేదీని కూడా మేకర్స్ నిర్ణయించారని వార్తలొస్తున్నాయి. శ్రీరామనవమి సందర్భంగా వచ్చే ఏడాది ఏప్రిల్ 9న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నారని సమాచారం. ఐమాక్స్ ఫార్మాట్‌తో చిత్రీకరిస్తున్న ఈ సినిమాను పలు భారతీయ భాషల్లో విడుదల చేయబోతున్నారు. ప్రియాంకచోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ తదితరుల ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతాన్నందిస్తున్నారు.