ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్ నిఖత్ జరీన్ తిరిగొచ్చింది. టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌లో జరిగిన చాంపియన్‌షిప్‌లో పసిడి పంచ్‌తో అదరగొట్టిన ఈ నిజామాబాద్ బిడ్డకు.. హైదరాబాద్‌లో ఘనస్వాగతం లభించింది. దేశం తలెత్తుకునేలా చేసిన తెలంగాణ బిడ్డకు స్వాగతం చెప్పేందుకు క్రీడాకారులు, క్రీడాభిమానులు శంషాబాద్ ఎయిర్‌పోర్టు చేరుకున్నారు.
శుక్రవారం సాయంత్రం ఆమె బయటకు రాగానే పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలిపారు. నిఖత్ జరీన్‌కు స్వాగతం పలికేందుకు తెలంగాణ రాష్ట్ర మంత్రులు శ్రీనివాస్ గౌడ్, ప్రశాంత్ రెడ్డి కూడా ఎయిర్‌పోర్టుకు వచ్చారు. ఆమెకు పూల బొకే ఇచ్చి స్వాగతించారు. క్రీడాభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ ఎన్నో నిర్ణయాలు తీసుకున్నారని, వాటి సహకారంతో నేడు నిఖత్ జరీన్ ప్రపంచ ఛాంపియన్ అయిందని ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ క్రీడాకారులు నిర్లక్ష్యానికి గురయ్యారని, తెలంగాణ వచ్చిన తర్వాత వారందరికీ టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోందని అన్నారు.
మంత్రి ప్రశాంత్ రెడ్డి కూడా నిఖత్ జరీన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఆమె తల్లిదండ్రుల త్యాగం, ప్రభుత్వ సహకారం, అకుంఠిత పట్టుదల వల్లనే నిఖత్ జరీన్ ఇంత గొప్ప విజయం సాధించిందని కొనియాడారు. నిజామాబాద్‌కే చెందిన షూటర్ ఇషా సింగ్ కూడా షూటింగ్లో పతకాలు సాధించిన విషయాన్ని గుర్తుచేశారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులకు ఎంత సపోర్ట్ ఇస్తుందో ఈ విజయాలే చెప్తున్నాయని అన్నారు.
తెలంగాణ ప్రభుత్వం అందించిన సహకారంతోనే తను ఈ విజయం సాధించానని ఈ సందర్భంగా నిఖత్ జరీన్ వెల్లడించింది. సీఎం కేసీఆర్, కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత, మంత్రులు శ్రీనివాస్ గౌడ్, ప్రశాంత్ రెడ్డిలకు ధన్యవాదాలు చెప్పిన ఆమె.. ‘‘ఎమ్మెల్సీ కవిత గారి సపోర్ట్ వల్లే ఈ స్థాయికి వచ్చాను. తెలంగాణ ప్రభుత్వం నాకు చేసిన సహకారాన్ని ఎన్నటికీ మర్చిపోలేను’’ అని పేర్కొంది.
— V Srinivas Goud (@VSrinivasGoud) May 27, 2022