Nicholas Kirton : మాదక ద్రవ్యాల కేసులో కెనడా క్రికెటర్ అరెస్ట్ అయ్యాడు. ఆ జట్టు కెప్టెన్ నికోలస్ కిర్టన్ (Nicholas Kirton)ను బార్బడోస్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డ్రగ్స్‌కు సంబంధించిన కేసులో నికోలస్‌ను విచారిస్తున్నారు. మార్చి 30(ఆదివారం)వ తేదీన నికోలస్ గ్రాంట్లే ఆడమ్స్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగగానే అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు.
‘ప్రస్తుతం నికోలస్ పోలీసుల కస్టడీలో ఉన్నాడు. 20 పౌండ్స్ అంటే.. 9 కిలోల గంజాయితో పట్టుబడడంపై అతడిని పోలీసులు విచారిస్తున్నారు.డ్రగ్స్ వ్యవహారం.. విచారణలో నికోలస్ పోలీసులకు సహకరించనున్నాడు’ అని జమైకా గ్లీనర్ అనే వార్త పత్రిక ఓ కథనంలో వెల్లడించింది.
A new era begins as Nicholas Kirton will lead Team Canada in ODIs and T20Is moving forward, starting with the ICC CWC League 2 in Netherlands ⚡️#weCANcricket #cricketcanada pic.twitter.com/RVsdMYam9w
— Cricket Canada (@canadiancricket) July 26, 2024
కరీబియన్ దీవుల్లోని బార్బడోస్‌లో డ్రగ్స్ అమ్మకాలపై నిషేధం ఉండేది. అయితే.. 2015లో ఆ చట్టాలను సవరించారు. డ్రగ్స్ అమ్ముకునేందుకు అనుమతులు ఇవ్వడం మొదలు పెట్టారు. అంతేకాదు గంజాయి, మరిజునా వంటి మొక్కల్ని పెంచుకునేందుఉ లైసెన్స్‌లు తప్పనిసరి చేశారు. అయితే.. ఇందులో కొన్ని పరిమితులు ఉన్నాయి. ఎవరైనా రెండు ఔన్స్‌లు అంటే.. 57 గ్రాముల గంజాయితో పట్టుబడితే నేరంగా పరిగణించరు. కానీ, గంజాయిని ప్రజా రవాణా సాధనాలైన బస్సులు, రైళ్లు, విమానాల్లో తీసుకెళ్లడం మాత్రం చట్టరీత్యా నేరం. అయితే.. వైద్యంలో ఉపయోగించే మరిజునాకు ఈ నిబంధన వర్తించదు.
బార్బడోస్‌లో జన్మించిన నికోలస్.. దేశవాళీలో అండర్ -17, అండర్ -19 జట్లుకు ఆడాడు. వెస్టీండీస్ అండర్-19 జట్టుకు కూడా ఆడాడు. అయితే.. జాతీయ జట్టులో మాత్రం చోటు దక్కించుకోలేకపోయాడు. నికోలస్ తల్లి కెనడా దేశస్థురాలు. దాంతో, అతడికి కెనడా తరఫున అంతర్జాతీయ క్రికెట్ ఆడే అవకాశం లభించింది. 2018లో అరంగేట్రం చేసిన నికోలస్ వన్డే, టీ20ల్లో నిలకడగా రాణిస్తున్నాడు. నిరుడు టీ20 వరల్డ్ కప్‌లో కెనడాకు సారథ్యం వహించిన నికోలస్.. త్వరలో నెదర్లాండ్స్ వేదికగా జరుగబోయే ఐసీసీ సీడబ్ల్యూసీ లీగ్ 2లో కెనడా బృందాన్ని నడిపించనున్నాడు.