IND vs NZ : భారత్ తన ముందుంచిన 285 పరుగుల లక్ష్యాన్ని చేధించడంలో న్యూజిలాండ్ బ్యాటర్లు తడబడుతున్నారు. కివీస్ ఓపెనర్లు డెవాన్ కాన్వే, హెన్రీ నికోలస్ తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. దాంతో ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన విల్ యంగ్, డారిల్ మిచెల్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నంలో నిదానంగా ఆడుతున్నారు. 20 ఓవర్లలో న్యూజిలాండ్ రెండు వికెట్ల నష్టానికి 82 పరుగుల చేసింది. గెలువడానికి 30 ఓవర్లలో మరో 203 పరుగులు చేయాల్సి ఉంది.
ప్రస్తుతం డారిల్ మిచెల్ (21), విల్ యంగ్ (31) క్రీజులో ఉన్నారు. కాగా మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్, న్యూజిలాండ్ మధ్య బుధవారం రెండో మ్యాచ్ జరుగుతోంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమ్ఇండియా 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 284 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (112 ; 92 బంతుల్లో 11 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీతో మెరిశాడు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (56; 53 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్) సిరీస్‌లో వరుసగా రెండో అర్ధ శతకం చేశాడు.
శ్రేయస్ అయ్యర్ (8) నిరాశపర్చగా.. రోహిత్ శర్మ (24), విరాట్ కోహ్లీ (23), రవీంద్ర జడేజా (27), నితీశ్ రెడ్డి (20) పరుగులు చేశారు. న్యూజిలాండ్ బౌలర్లలో క్రిస్టియన్ క్లార్క్ 3, జేమీసన్, ఫౌక్స్, జేడెన్ లెనాక్స్, మైకేల్ బ్రాస్‌వెల్ ఒక్కో వికెట్ పడగొట్టారు. ఓపెనర్లు రోహిత్, గిల్ తొలి వికెట్‌కు 70 పరుగులు జోడించారు. రోహిత్‌ను క్రిస్టియన్ క్లార్క్ వెనక్కి పంపాడు. ఒక దశలో 99/1 తో పటిష్ఠ స్థితిలో నిలిచిన భారత్.. గిల్, కోహ్లీ, శ్రేయస్ వరుసగా పెవిలియన్ చేరడంతో 118/4తో కష్టాల్లో పడింది. 18-27 ఓవర్ల మధ్య భారత బ్యాటర్లు ఒక్క బౌండరీ కూడా కొట్టలేదు.
ఈ క్రమంలో జడేజాతో కలిసి రాహుల్ ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టాడు. ఈ జోడీ ఐదో వికెట్‌కు 88 బంతుల్లో 73 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. జడ్డూ.. మైకేల్ బ్రాస్‌వెల్‌కు రిటర్న్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అనంతరం నితీశ్‌తో జతకట్టిన రాహుల్ 52 బంతుల్లో అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. నితీశ్‌ను ఫౌక్స్ ఔట్ చేయగా.. కాసేపటికే హర్షిత్ రాణా (2)ను జేడెన్ లెనాక్స్ పెవిలియన్‌కు పంపాడు. అప్పటికి 87 పరుగులతో ఉన్న రాహుల్ జేమీసన్ వేసిన 49 ఓవర్లో ఫోర్, సిక్స్ కొట్టి శతకం (87 బంతుల్లో) పూర్తిచేశాడు.