పెద్దగా అంచనాలులేకుండానే వన్డే ప్రపంచకప్ బరిలోకి దిగిన న్యూజిలాండ్.. వరుస విజయాలతో అదరగొడుతున్నది. ఇప్పటికే హ్యాట్రిక్ ఖాతాలో వేసుకున్న కివీస్.. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అఫ్గాన్‌ను చిత్తుచేసింది. గత మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్‌కు షాకిచ్చిన కాబూలీలు.. న్యూజిలాండ్‌పై అదే జోరు కొనసాగించలేకపోయారు. ముఖ్యంగా పేలవ ఫీల్డింగ్‌తో అఫ్గాన్ మూల్యం చెల్లించుకోగా.. కివీస్ మాత్రం కండ్లు చెదిరే క్యాచ్‌లతో అదుర్స్ అనిపించింది.
చెన్నై: ప్రపంచకప్‌లో న్యూజిలాండ్ నాలుగో విజయం నమోదు చేసుకుంది. ప్రత్యర్థితో సంబంధం లేకుండా మైదానంలో సంపూర్ణ ఆధిపత్యం కొనసాగిస్తున్న న్యూజిలాండ్ బుధవారం చెన్నై చెపాక్ స్టేడియంలో జరిగిన పోరులో 149 పరుగుల తేడాతో అఫ్గానిస్థాన్‌ను మట్టికరిపించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది. గ్లెన్ ఫిలిప్స్ (71; 4 ఫోర్లు, 4 సిక్సర్లు), టామ్ లాథమ్ (68; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), విల్ యాంగ్ (54; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధశతకాలతో రాణించారు. అఫ్గాన్ బౌలర్ల ధాటికి ఒక దశలో ఒక పరుగు వ్యవధిలో 3 వికెట్లు కోల్పోయి 110/4తో కష్టాల్లో పడ్డట్లు కనిపించిన కివీస్‌ను కెప్టెన్ లాథమ్, ఫిలిప్స్ ఆదుకున్నారు. ఆరంభంలో ఆచితూచి ఆడిన ఈ జోడీ.. క్రీజులో కుదురుకున్నాక బౌండ్రీల మోత మోగించింది. మరో సంచలనం ఖాయమే అనిపించేలా అఫ్గాన్ బౌలర్లు విజృంభిస్తుంటే.. ఫీల్డర్లు మాత్రం పేలవ ప్రదర్శనతో చేజేతులా మ్యాచ్‌ను దూరం చేశారు. అజ్మతుల్లా, నవీన్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం అఫ్గాన్ 34.4 ఓవర్లలో 139 పరుగులకు ఆలౌటైంది. రహ్మత్ షా (36) టాప్ స్కోరర్ కాగా.. రహ్మానుల్లా (11), ఇబ్రహీం (14), హష్మతుల్లా (8), అజ్మతుల్లా (27), ఇక్రామ్ (19), మహమ్మద్ నబీ (7), రషీద్ ఖాన్ (8) విఫలమయ్యారు. కివీస్ బౌలర్లలో శాంట్నర్, ఫెర్గూసన్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. ఫిలిప్స్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.
గత మ్యాచ్‌లో సమిష్టి ప్రదర్శనతో ప్రపంచ చాంపియన్ ఇంగ్లండ్‌ను మట్టికరిపించిన అఫ్గాన్.. ఈ మ్యాచ్‌లో పేలవ ఫీల్డింగ్‌కు మూల్యం చెల్లించుకుంది. లడ్డూలాంటి క్యాచ్‌లు అందుకోవడంలో కూడా కాబూలీలు తడబడ్డారు. మొత్తంగా ఈ మ్యాచ్‌లో ఐదు క్యాచ్‌లు, ఓ స్టంపింగ్ అవకాశం చేజారగా.. మ్యాచ్ గతిని మార్చిన లాథమ్ ఇచ్చిన రెండు క్యాచ్‌లను కాబూలీలు అందుకోలేకపోయారు. ఆ రెండూ రషీద్ ఖాన్ బౌలింగ్‌లోనే కావడం గమనార్హం. న్యూజిలాండ్ మాత్రం కట్టుదిట్టమైన ఫీల్డింగ్‌తో ఆకట్టుకుంది. ముఖ్యంగా ఫెర్గూసన్ వేసిన 14వ ఓవర్లో శాంట్నర్ పట్టిన క్యాచ్ చూసి తీరాల్సిందే. అఫ్గాన్ కెప్టెన్ హష్మతుల్లా షార్ట్‌బాల్‌ను పుల్ చేసేందుకు ప్రయత్నించగా.. అది కాస్తా గాల్లోకి లేచింది. సమీపంలో ఫీల్డింగ్ చేస్తున్న శాంట్నర్ వెనక్కి పరిగెడుతూ.. అసాధ్యం అనుకుంటున్న సమయంలో ఒంటిచేత్తో బంతిని ఒడిసి పట్టి ఔరా అనిపించాడు!
న్యూజిలాండ్:50 ఓవర్లలో 288/6 (ఫిలిప్స్ 71, లాథమ్ 68; నవీన్ 2/48, అజ్మతుల్లా 2/56),
అఫ్గానిస్థాన్: 34.4 ఓవర్లలో 139 ఆలౌట్ (రహ్మత్ షా 36; ఫెర్గూసన్ 3/19, శాంట్నర్ 3/39).