Hanuman Ansh | బాలీవుడ్ నుంచి విడుదలై బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన ‘హనుమాన్ అంశ్’ చిత్రంలోని భక్తి పాట ప్రపంచవ్యాప్తంగా చరిత్ర సృష్టిస్తోంది. ఈ సినిమాలోని ‘పార్వతి’ అనే పాట ఇప్పుడు కేవలం ఒక పాపులర్ డివోషనల్ ట్రాక్‌గా మాత్రమే కాకుండా, గ్లోబల్ చార్ట్ సెన్సేషన్‌గా అవతరించింది. బుందేలీ జానపద సంగీత శైలి ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ గీతం యూట్యూబ్ మ్యూజిక్ ఇండియా వీక్లీ చార్ట్స్‌లో అగ్రస్థానాన్ని దక్కించుకోవడంతో పాటు, యూట్యూబ్ మ్యూజిక్ గ్లోబల్ సాంగ్స్ చార్ట్‌లో ఏకంగా రెండో స్థానాన్ని కైవసం చేసుకుంది. యూట్యూబ్ నివేదికల ప్రకారం, ఈ పాట ఒక్క భారతదేశంలోనే ఏకంగా 47 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది. ఇక గ్లోబల్ చార్ట్‌లో ప్రముఖ సింగర్స్ షకీరా మరియు బర్నా బాయ్స్ సంయుక్తంగా నటించిన ‘డై డై’ పాట మొదటి స్థానంలో ఉండగా, తర్వాతి స్థానంలో ‘పార్వతి’ పాట నిలవడం విశేషం.
సాధు తివారీ స్వయంగా ఆలపించి, రచించి, సంగీతం అందించిన ఈ పాట యూట్యూబ్ వేదికగా మొత్తం అన్ని వెర్షన్లలో కలిపి ఏకంగా 100 మిలియన్లకు పైగా వ్యూస్‌ను దాటేసింది. కేవలం సాంప్రదాయ భక్తి సంగీత ప్రియులకే కాకుండా, యువతను సైతం విపరీతంగా ఆకట్టుకున్న ఈ పాట ఇన్స్టాగ్రామ్ రీల్స్ మరియు ఇతర సోషల్ మీడియా వేదికలపై ట్రెండింగ్‌లో నిలిచింది. ఈ పాట భారీ విజయం సాధించడానికి ప్రధాన కారణాలలో ఒకటి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రదర్శన అని చెప్పవచ్చు. ఢిల్లీలో జరిగిన ఒక భజన్ క్లబ్బింగ్ ఈవెంట్లో ప్రధాని నరేంద్ర మోదీ ఈ పాటకు ప్రత్యక్ష ప్రదర్శనలో లీనమై ఉండడం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
విశాల్ చతుర్వేది దర్శకత్వంలో తెరకెక్కిన ‘హనుమాన్ అంశ్’ చిత్రం లక్ష్మీ నారాయణ్ అనే యువకుడి చుట్టూ తిరుగుతుంది. వ్యక్తిగత నష్టం తర్వాత ఇల్లు విడిచి వెళ్ళిన ఆ బాలుడు దేవుడి అన్వేషణలో ఆధ్యాత్మిక ప్రయాణం సాగించి, చివరికి నీమ్ కరోలీ బాబాగా మారే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. దర్శకుడు రాసిన ‘డివైన్ డిటూర్’ పుస్తకం ఆధారంగా రూపొందిన ఈ చిత్రం త్రివిక్రమ్ తరహాలో ట్రయాలజీగా రాబోతోంది. కేవలం రూ. 2 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ. 410 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి సంచలన రికార్డు సృష్టించింది.