Dimond League : భారత్, పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతల కారణంగా ఎన్సీ క్లాసిక్ (NC Classic 2025)ను వాయిదా వేసిన నీరజ్ చోప్రా (Neeraj Chopra) ప్రతిష్ఠాత్మక దోహా డైమండ్ లీగ్ (Daimond League)లో బరిలోకి దిగుతున్నాడు. ఇప్పటికే ఈ లీగ్‌లో రెండు పతకాలు కొల్లగొట్టిన నీరజ్.. టైటిల్‌పై గురి పెట్టాడు. మే 16న ఈ టోర్నీ మొదలవ్వనున్న ఈ పోటీల్లో బడిసె వీరుడితో పాటు భారత్‌కు చెందిన మరో ముగ్గురు పాల్గొననున్నారు.
జావెలిన్ త్రోలో కిశోర్ జెనా (Kishore Jena) తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. నిరుడు 9వ స్థానంతో నిరాశపరిచిన అతడు పతకంపై కన్నేశాడు. జాతీయ రికార్డు నెలకొల్పిన గల్వీర్ సింగ్ (Gulveer Singh) 5 వేల మీటర్ల పరుగులో.. మహిళల విభాగంలో పరుల్ చౌదరీ 3000 మీటర్ల స్టీపుల్ ఛేజ్‌లో బరిలోకి దిగుతున్నారు.
జావెలిన్ త్రోలో రికార్డు బద్ధలు కొడుతున్న నీరజ్ గత రెండేళ్ల నుంచి భీకర ఫామ్‌లో ఉన్నాడు. డైమండ్ లీగ్ 2023లో ఈటెను 88.67 మీటర్ల దూరం విసిరి టైటిల్ సాధించాడు నీరజ్. నిరుడు 88.36 మీటర్ల దూరంతో రెండో స్థానంలో నిలిచాడు. అయితే.. ఈసారి 90 మీటర్ల మార్కుతో టైటిల్ సాధించాలనే కసితో ఉన్నాడు నీరజ్.
కానీ, ఈసారి కూడా అతడికి ఒలింపిక్ కాంస్య పతక విజేత అండర్సన్ పీటర్స్ (గ్రెనెడా), 2024 విన్నర్ జాకబ్ వాద్లెక్(చెక్ రిపబ్లిక్)లతో గట్టి పోటీ ఎదురయ్యే అవకాశముంది. జర్మనీ అథ్లెట్లు జులియన్ వెబర్, మాక్స్ డెహ్నింగ్, జులియస్ యెగో(కెన్యా), రోడెరిక్ డీన్(జపాన్)లు పాల్గొంటున్నారు.