న్యూఢిల్లీ: ఆపరేషన్ సిందూర్ తర్వాత పాకిస్థాన్ సైనిక దాడులను భారత్ ధీటుగా ఎదుర్కొన్నదని భారత త్రివిధ దళాల అధికారులు తెలిపారు. ఈ క్రమంలో పాకిస్థాన్‌కు చెందిన కొన్ని ఆధునిక ఫైటర్ జెట్లను కూల్చివేసినట్లు చెప్పారు. (Pak jets downed) పాక్ దాడుల్లో ఐదుగురు సైనికులను కోల్పోయినట్లు వివరించారు. పదుల సంఖ్యలో పౌరులకు ప్రాణ నష్టం జరిగిందని అన్నారు. మిలిటరీ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్, లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్, ఎయిర్ మార్షల్ ఏకే భారతి, వైస్ అడ్మిరల్ ఏఎన్ ప్రమోద్ ఆదివారం మీడియాతో మాట్లాడారు. పాకిస్థాన్ ఆక్రమిత జమ్ముకశ్మీర్ (పీవోకే)తోపాటు పాకిస్థాన్‌లోని 9 ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై దాడి కోసమే మే 7న ‘ఆపరేషన్ సిందూర్’ను ప్రారంభించినట్లు చెప్పారు. కేవలం ఉగ్రవాద స్థావరాలనే ధ్వంసం చేశామని అన్నారు. పాక్ సైనిక స్థావరాలతోపాటు పౌరుల జోలికి వెళ్లలేదని స్పష్టం చేశారు. ఉగ్రవాద స్థావరాల ధ్వంసంలో అనుకున్న లక్ష్యాలను సాధించినట్లు ఆధారాలతో సహా వివరించారు. వంద మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యాయరని వెల్లడించారు.
కాగా, ఆపరేషన్ సిందూర్ తర్వాత పాకిస్థాన్ సైన్యం దాడులను ఉదృతం చేసిందని భారత త్రివిధ దళాల అధికారులు తెలిపారు. డ్రోన్లు, యూవీలతో దాడులతో పాటు సరిహద్దుల్లో కాల్పుల తీవ్రత పెరిగిందని చెప్పారు. దీంతో ధీటుగా సమాధానం ఇచ్చామన్నారు. ఎయిర్ డిఫెన్స్‌తో డ్రోన్సు, యూవీలను కూల్చివేసినట్లు తెలిపారు.
మరోవైపు సరిహద్దులో ఉద్రిక్తతలు రెచ్చగొట్టవద్దన్న సందేశం ఇచ్చేందుకు పాకిస్థాన్ సైనిక స్థావరాలపై దాడులు చేసినట్లు త్రివిధ దళాల అధికారులు తెలిపారు. పాక్ ఎయిర్ బేస్‌లకు భారీ నష్టం కలిగించినట్లు చెప్పారు. ఎఫ్ 16 వైమానిక స్థావరాలు, శిక్షణా కేంద్రాలు, వైమానిక రక్షణ విభాగాలు, కమాండ్ హబ్‌లను విజయవంతంగా లక్ష్యంగా చేసుకుని ఖచ్చితమైన దాడులు జరిగాయని ధృవీకరించారు. పాకిస్థాన్‌కు చెందిన కొన్ని ఆధునిక ఫైటర్ జెట్లను కూల్చివేశామని అన్నారు. భారత భూభాగంపైకి రాకుండా వాటిని అడ్డుకుకోవడంతో శిథిలాల ఆధారాలు మన వద్ద లేవన్నారు. అలాగే సుమారు 40 మంది పాక్ సైనికులు మరణించి ఉంటారని అంచనా వేశారు.
కాగా, పాక్ దాడుల్లో భారత్ సైనిక స్థావరాలకు ఎలాంటి నష్టం జరుగలేదని త్రివిధ దళాల అధికారులు తెలిపారు. పాక్ కాల్పుల్లో ఐదుగురు సైనికులను కోల్పోయినట్లు చెప్పారు. బాధిత సైనిక కుటుంబాలకు అండగా ఉంటామని అన్నారు. పాకిస్థాన్ భారత పౌరులను లక్ష్యంగా చేసుకున్నదని ఆరోపించారు. దీంతో పదుల సంఖ్యలో పౌరులకు ప్రాణ నష్టం జరిగిందని వివరించారు. బాధిత కుటుంబాలకు కలిగిన లోటు తీర్చలేనిదని అన్నారు.
మరోవైపు పాక్ డీజీఎంఏ వినతి మేరకే కాల్పుల విరమణకు అంగీకరించినట్లు మిలిటరీ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్, లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్ తెలిపారు. అయినప్పటికీ ఈ నిబంధనను పాక్ ఉల్లంఘించిందని ఆయన ఆరోపించారు. భారత్ ఎంతో సంయమనం పాటిస్తున్నదని చెప్పారు. పాక్ వైఖరి ఇలాగే కొనసాగితే తగిన విధంగా ప్రతిస్పందిస్తామని అన్నారు. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు ఇరుదేశాల మిలిటరీ అధికారుల మధ్య చర్చలు జరుగుతాయని వివరించారు. మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు త్రివిధ దళాల అధికారులు సమాధానమిచ్చారు. భారత దేశ సౌరభౌమత్యాన్ని కాపాడం, దేశాన్ని రక్షించడంమే తమ ధ్యేయమని స్పష్టం చేశారు.
#WATCH | Delhi: Air Marshal AK Bharti shows the detailed missile impact video at Bahwalpur terror camp. #OperationSindoor pic.twitter.com/OnT5sdwrND
— ANI (@ANI) May 11, 2025