Operation Sindoor | న్యూఢిల్లీ : పాకిస్తాన్ ఎన్ని దుశ్చర్యలకు పాల్పడినా దీటుగా స్పందించేందుకు సిద్ధంగా ఉన్నామని డీజీఎంవో రాజీవ్ ఘాయ్ స్పష్టం చేశారు. పాకిస్తాన్ డీజీఎంవో ప్రతిపాదన మేరకే కాల్పుల విరమణపై అవగాహనకు వచ్చాం. అయినా కొన్ని గంటల్లోనే మళ్లీ డ్రోన్ దాడులు కొనసాగించింది. ఇదే పరిస్థితి నేడు కొనసాగితే తీవ్ర ప్రతిచర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఉల్లంఘనలపై దీటుగా స్పందించేందుకు క్షేత్రస్థాయి అధికారులకు సైన్యాధ్యక్షుడు పూర్తి అధికారులు ఇచ్చారని తెలిపారు. సోమవారం మధ్యాహ్నం ఇరుదేశాల డీజీఎంవోల మధ్య చర్యలు ఉంటాయి. డీజీఎంవోల చర్చల తర్వాత మా తదుపరి నిర్ణయాలు ఉంటాయన్నారు.
ఇక భారత వాయుసేన, క్షిపణి రక్షణ వ్యవస్థలతో సైన్యం పాకిస్తాన్కు స్పష్టమైన సందేశం ఇచ్చాం. పాకిస్తాన్ దుస్సాహసానికి పాల్పడితే ఎలాంటి పర్యవసానాలు ఎదురవుతాయో చూపించామన్నారు. సైన్యం, వాయుసేన చర్యలకు అనుబంధంగా అరేబియా సముద్రంలో నౌకాదళం సర్వసన్నద్ధంగా ఉంది. కశ్మీర్ నుంచి గుజరాత్ వరకు సరిహద్దు నగరాలపై డ్రోన్ దాడులకు యత్నించింది. గుంపులు గుంపులుగా డ్రోన్లతో దాడులకు యత్నించిందని తెలిపారు. భారత సైన్యం చర్యలతో పాకిస్తాన్ వణికిపోయిందని డీజీఎంవో పేర్కొన్నారు.