ECB : సీనియర్ ఆల్‌రౌండర్ నాట్ సీవర్ బ్రంట్ (Nat Sciver-Brunt) ఇంగ్లండ్ జట్టుకు కెప్టెన్‌గా ఎంపికైంది. ఇప్పటివరకూ వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న సీవర్.. హీథర్ నైట్(Heather Knight) వారసురాలిగా త్వరలోనే సారథిగా బాధ్యతలు చేపట్టనుంది. గత కొంతకాలంగా బ్యాటుతో, బంతితో నిలకడగా రాణిస్తున్న సీవర్‌ను తదుపరి కెప్టెన్‌గా సెలెక్టర్లు ఎంపిక చేశారు. ఈ విషయాన్ని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు మంగళవారం వెల్లడించింది.
ఇన్ని రోజులు జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించిన ఈ ఆల్‌రౌండర్ కెప్టెన్సీ వరించడంపై సంతోషం వ్యక్తం చేసింది. ఎట్టకేలకు తన కల సాకారం అయిందని మురిసిపోతోందీ మూడు ఫార్మాట్లలో ఇంగ్లండ్‌కు వెన్నెముకలా నిలుస్తున్న సీవర్.
BREAKING: Nat Sciver-Brunt has been named as Heather Knight’s successor as England Women captain 🏴 pic.twitter.com/VVe3aIrpkZ
— ESPNcricinfo (@ESPNcricinfo) April 29, 2025
‘ఇంగ్లండ్ మహిళల జట్టు కెప్టెన్‌గా ఎంపికైనందుకు చాలా గర్వంగా, సంతోషంగా ఉంది. ఇది నాకు గొప్ప గౌరవం. నేను ఎంతో కాలంగా ఈ రోజు కోసం ఎదురు చూస్తున్నాను. 2013లో ఇంగ్లండ్ తరఫున తొలి మ్యాచ్ ఆడాను. మైదానంలోకి దిగిన ప్రతిసారి జట్టు విజయం కోసం సర్వశక్తులు ఒడ్డాను. ఇప్పుడు కొత్త బాధ్యతలు చేపట్టబోతున్నా. కెప్టెన్‌గా ఇంగ్లండ్ టీమ్‌ను నడిపించేందుకు ఉత్సాహంగా ఉన్నాను. మళ్లీ జట్టును గెలుపు బాట పట్టిస్తాను’ అని సీవర్ బ్రంట్ వెల్లడించింది.
NSB at the helm 🤝 pic.twitter.com/xW1x5bk4dJ
— England Cricket (@englandcricket) April 29, 2025
ఆస్ట్రేలియా పర్యటనలో యాషెస్ సిరీస్(Ashes Sereis)లో హీథర్ నైట్ కెప్టెన్సీలోని ఇంగ్లండ్ దారుణంగా విఫలమైంది. ఆ ఓటమికి బాధ్యత వహిస్తూ హీథర్ నాయకత్వ బాధ్యతల నుంచి వైదొలిగింది. దాంతో, కొత్త సారథి వేట మొదలుపెట్టిన ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు వైస్ కెప్టెన్‌గా ఉన్న సీవర్ బ్రంట్ వైపు మొగ్గు చూపింది. త్వరలోనే వెస్టిండీస్‌తో మూడు వన్డేల సిరీస్‌తో సీవర్ బ్రంట్‌కు తొలి సవాల్ ఎదరుకానుంది.