చివ్వెంల, ఏప్రిల్ 29 : ధరణిలో మార్పులు చేర్పులకు అవకాశం ఉండేది కాదని, భూ భారతిలో అవకాశం ఉందని సూర్యాపేట కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త చట్టం భూ భారతితో రైతుల సమస్యలన్నీ తీరిపోతాయని తెలిపారు. మంగళవారం సూర్యాపేట జిల్లా చివ్వెంల మండల కేంద్రంలోని వెంకట్‌రెడ్డి ఫంక్షన్ హాల్ నందు భూ భారతి చట్టం 2025పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా కలెక్టర్ మాట్లాడారు.
రైతుకు, రైతు కుటుంబానికి భూమి ఆధారమని అట్టి భూమి వివరాలు పట్టా పుస్తకంలో సరిగ్గా నమోదు లేకపోతే ఎన్నో సమస్యలు ఉత్పన్నమౌతున్నట్లు తెలిపారు. త్వరలోనే గ్రామ పరిపాలన అధికారులు అన్ని పంచాయతీలకు నియామకం కానున్నట్లు చెప్పారు. గతంలో సాదాబైనామాలు, భూముల రెగ్యులేషన్ కాలేదని, కానీ ఇప్పుడు ఆ ప్రక్రియకు భూభారతిలో అవకాశం ఉందని తెలిపారు. భూ సమస్యల పరిష్కారానికి రెండు అంచెల అప్పిల్ వ్యవస్థ ఉందని, తాసీల్దార్ వద్ద కాకుంటే ఆర్డీఓ స్థాయిలో అప్పీల్‌కు వెళ్లవచ్చు అన్నారు.
ప్రతి వ్యక్తికి ఆధార్ ఉన్నట్టుగానే ప్రతి భూమికి భూదార్ కార్డు జారీ చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. అనంతరం రైతుల సందేహాలను కలెక్టర్, అదనపు కలెక్టర్ పి.రాంబాబు నివృత్తి చేశారు. ఈ కార్యక్రమంలో తాసీల్దార్ కృష్ణయ్య, మార్కెట్ కమిటీ డైరెక్టర్ దరావత్ వీరన్ననాయక్, మండల ప్రత్యేక అధికారి జగదీశ్వర్ రెడ్డి, ఎంపీడీఓ సంతోశ్‌కుమార్, ఏఓ వెంకటేశ్వర్లు, అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.
Chivvemla : మార్పులు చేర్పులకు భూ భారతిలో అవకాశం : కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్