తెలంగాణ దేశానికి దిక్సూచిగా నిలుస్తున్నది. అన్ని రంగాల్లో అద్భుత ప్రగతి సాధిస్తూ మిగతా రాష్ర్టాలకు ఆదర్శమవుతున్నది. సీఎం కేసీఆర్ దూరదృష్టితో దేశం దృష్టిని ఆకర్షిస్తున్నది. ప్రతీ రంగం సాధిస్తున్న అభివృద్ధికి నిలువెత్తు సాక్ష్యం. ఇందుకు క్రీడారంగం కూడా అతీతం కాదు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ బిడ్డలు దేశ ఖ్యాతిని దశదిశలా విస్తరిస్తున్నారు. ప్రభుత్వ ప్రోత్సాహాన్ని అందిపుచ్చుకుంటూ పతకాల పంట పండిస్తున్నారు. భవిష్యత్‌లో దేశ క్రీడారంగాన్ని ఏలేందుకు తెలంగాణ సమాయత్తమవుతున్నది. ఒలింపిక్స్, కామన్వెల్త్, ఆసియాగేమ్స్ లాంటి ప్రతిష్ఠాత్మక టోర్నీల్లో పతకాలతో మెరిసేందుకు ప్లేయర్లు కష్టపడుతున్నారు. ఇప్పటికే నిఖత్జరీన్, ఇషాసింగ్, ఆకుల శ్రీజ, నందిని, హుసాముద్దీన్ లాంటి ప్లేయర్లు అదరగొడుతుంటే భవిష్యత్‌లో మరింత మంది వెలుగులోకి రాబోతున్నారు. ఈ నేపథ్యంలో సాట్స్ నూతన చైర్మన్‌గా బాధ్యతలు తీసుకున్న డాక్టర్ ఆంజనేయగౌడ్తో ‘నమస్తే తెలంగాణ’ ముచ్చటించింది. సీఎం కేసీఆర్ మార్గదర్శకత్వంలో రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని చెబుతున్న సాట్స్ చైర్మన్‌తో ప్రత్యేక ఇంటర్వ్యూ.
క్రీడాభివృద్ధికి మీ భవిష్యత్ ప్రణాళికలు ఏంటీ?
రాష్ట్రంలో అన్ని రంగాల్లో నిర్మాణాత్మక అభివృద్ధి సాధించినట్లే..క్రీడల్లోనూ మెరుగైన పురోగతి కోసం కష్టపడి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నాను. సీఎం కేసీఆర్ మార్గదర్శకత్వంలో దేశంలోని మిగతా రాష్ర్టాలకు ఆదర్శంగా నిలిచేలా క్రీడలను కొత్తపుంతలు తొక్కిస్తాం. గ్రామాలు, పట్టణాలు అన్న తేడా లేకుండా ప్రతిభకు పెద్దపీట వేస్తూ అండగా నిలుస్తాం. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వం అవిరళ కృషి చేస్తున్నది. ప్రతిభకు పేదరికం అడ్డుకాదన్న రీతిలో అందరినీ ప్రోత్సహించేందుకు సిద్ధంగా ఉన్నాం.
క్రీడాహబ్‌గా తెలంగాణ..దీనిపై మీ అభిప్రాయం ఏంటీ?
తెలంగాణ..దేశానికి క్రీడా హబ్‌గా మారుతున్నది. ఇటీవలే జరిగిన కామన్వెల్త్ గేమ్స్ అందుకు నిదర్శనం. బర్మింగ్‌హామ్ వేదికగా జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో తెలంగాణ ప్లేయర్లు ఆరు పతకాలతో దేశంలో రెండో స్థానంలో నిలిచారు. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహాన్ని అందిపుచ్చుకుంటూ బ్రిటన్ గడ్డపై త్రివర్ణ పతాకాన్ని సగర్వంగా రెపరెపలాడించారు. దేశ ఖ్యాతిని ఇనుమడింపజేస్తూ అంతర్జాతీయ వేదికపై తళుక్కుమన్నారు. రానున్న భవిష్యత్‌లోనూ రాష్ట్రం నుంచి మరింత మంది ప్లేయర్లు పతకాలు సాధించేలా పక్కా ప్రణాళికను అమలుపరుస్తాం. సీఎం కేసీఆర్ విలువైన సలహాలు, సూచనలకు అనుగుణంగా సాట్స్ ముందుకెళుతుంది.
స్టేడియాల నిర్మాణం ఎలా ఉంది?
ప్రతీ నియోజకవర్గంలో స్టేడియాల నిర్మాణం లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళుతున్నది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఆయా జిల్లా కలెక్టర్ల చొరవతో యుద్ధ ప్రాతిపదికన స్టేడియాల నిర్మాణం చేస్తున్నాం. ఇప్పటికే దాదాపు 93 నియోజకవర్గాల్లో నిర్మాణాలు పూర్తయ్యాయి..త్వరలో మిగ తా నియోజకవర్గాల్లో పూర్తి చేస్తాం. ఇందుకుతోడు ప్రతీ గ్రామంలో క్రీడా ప్రాంగణాలు నెలకొల్పుతున్నాం. దాదాపు 12 వేల గ్రామాల్లో ప్రాంగాణాల నిర్మాణం పూర్తయ్యింది. జాతీయ, అంతర్జాతీయ టోర్నీలకు తెలంగాణ ప్లేయర్లను సిద్ధం చేయాలన్న ఏకైక లక్ష్యంతో సాట్స్ ముందుకెళుతున్నది.
గ్రామీణ ప్రాంతాల్లో క్రీడాభివృద్ధిపై మీ అభిప్రాయం?
చాలా మంది ప్లేయర్లు గ్రామీణ ప్రాంతాల నుంచే వస్తున్నారు. తమకు అందుబాటులో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకుంటూ అంచలంచెలుగా ఎదుగుతున్నారు. ఇలాంటి ప్రతిభ కల్గిన మెరికల్లాంటి ప్లేయర్లను వెలుగులోకి తీసుకొచ్చేందుకు ప్రభు త్వం ప్రతీ నియోజకవర్గంలో స్టేడియాలు నిర్మిస్తున్నది. వీటి వల్ల ఆరోగ్యానికి ఆరోగ్యంతో పాటు క్రీడల్లో సత్తాచాటేందుకు యువకులకు అవకాశం దొరుకుతుంది. గ్రామీణ ప్రాంత ప్లేయర్లను తీర్చిదిద్దేందుకు అనుభవజ్ఞలైన కోచ్‌ల సహకారంతో ముందుకెళుతాం.
రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ(సాట్స్) చైర్మన్‌గా నాకు అవకాశమిచ్చిన సీఎం కేసీఆర్‌కు జీవితాంతం రుణపడి ఉంటాను. సామాన్య దిగువ మధ్యతరగతికి చెందిన నాకు వెన్నుతట్టి నిలువడం మరిచిపోలేనిది. సీఎం మార్గదర్శకత్వంలో క్రీడాభివృద్ధి కోసం శక్తివంచన లేకుండా పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నాను. క్రీడారంగంలో దేశానికి దిక్సూచిలా రాష్ర్టాన్ని నిలిపేందుకు ప్రయత్నిస్తా. ఈ క్రమంలో మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్‌గౌడ్ సహకారంతో ముందుకెళుతాను. గ్రామీణ ప్రాంత క్రీడాకారులను వెలుగులోకి తీసుకురావడమే లక్ష్యంగా ముందుకెళుతాను.