IPL | ముంబై: సీజన్ ఆరంభంలో తడబడ్డ ముంబై ఇండియన్స్ ఐపీఎల్-18లో వరుస విజయాలతో హ్యాట్రిక్ కొట్టింది. ఢిల్లీ, హైదరాబాద్‌పై ఇచ్చిన విజయాల ఊపులో ఉన్న హార్దిక్ పాండ్యా సేన.. వాంఖడేలో ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే)తో జరిగిన పోరులోనూ గెలిచి ప్రత్యర్థి జట్లకు భారీ హెచ్చరికలు పంపింది. ఈ సీజన్లో వరుసగా విఫలమవుతున్న రోహిత్ శర్మ.. (45 బంతుల్లో 76 నాటౌట్, 4 ఫోర్లు, 6 సిక్సర్లు) మరో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్‌తో కదం తొక్కగా.. సూర్యకుమార్ యాదవ్ (30 బంతుల్లో 68 నాటౌట్, 6 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపులతో చెన్నై నిర్దేశించిన 177 పరుగుల ఛేదనను ముంబై 15.4 ఓవర్లలోనే దంచేసింది.
మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై.. రవీంద్ర జడేజా (35 బంతుల్లో 53 నాటౌట్, 4 ఫోర్లు, 2 సిక్సర్లు), శివమ్ దూబే (32 బంతుల్లో 50, 2 ఫోర్లు, 4 సిక్సర్లు) రాణించడంతో 20 ఓవర్లకు 176/5 స్కోరుచేసింది. ఈ విజయంతో సీజన్ రెండో ఎల్‌క్లాసికో (ముంబై, చెన్నై మ్యాచ్‌ను అభిమానులు ఇలా పిలుచుకుంటారు)ను గెలుచుకున్న ముంబై.. తొలి మ్యాచ్‌లో ఎదురైన పరాభవానికి బదులు తీర్చుకున్నైట్టెంది. రోహిత్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.
ఈ మ్యాచ్‌లో ముంబైకి విజయంతో పాటు రోహిత్ ఫామ్‌లోకి రావడం బోనస్‌గా దక్కింది. ఈ సీజన్లో ఇంప్యాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగుతూ వరుసగా విఫలమవుతున్న హిట్‌మ్యాన్.. కీలక మ్యాచ్‌లో జూలు విదిల్చాడు. అచ్చొచ్చిన వాంఖడేలో తనదైన ట్రేడ్ మార్క్ సిక్సర్లతో అభిమానుల కరువు తీర్చడంతో పాటు తనపై వస్తున్న విమర్శలకూ దీటుగా సమాధానమిచ్చాడు. ఓవర్టన్ రెండో ఓవర్లో బ్యాక్వర్డ్ స్కేర్ లెగ్ మీదుగా సిక్సర్‌తో మొదలైన రోహిత్ దూకుడు.. ఇన్నింగ్స్ ఆసాంతం కొనసాగింది.
ఖలీల్ బౌలింగ్‌లోనూ హిట్‌మ్యాన్ 6, 4, 4 బాదాడు. రికెల్టన్ (24)ను ఔట్ చేసినా చెన్నైకి ఆ ఆనందం ఎక్కువసేపు నిలువలేదు. సూర్య రాకతో అగ్నికి వాయువు తోడైనైట్టెంది. ఇద్దరూ చెన్నై బౌలర్లపై వంతులు వేసుకుంటూ విరుచుకుపడ్డారు. 33 బంతుల్లో రోహిత్ ఫిఫ్టీ పూర్తయింది. నూర్ అహ్మద్ బౌలింగ్‌లో హ్యాట్రిక్ బౌండరీలు కొట్టిన సూర్య.. 26 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. పతిరాన 16వ ఓవర్లో రోహిత్ ఓ సిక్స్ కొట్టగా సూర్య రెండు సిక్సర్లతో లాంఛనాన్ని పూర్తిచేశాడు. ఈ సీజన్లో ఆడిన 8 మ్యాచ్‌లకు గాను చెన్నైకి ఇది ఆరో ఓటమి.
చెన్నై: 20 ఓవర్లలో 176/5 (జడేజా 53*, దూబె 50, బుమ్రా 2/25, శాంట్నర్ 1/14);
ముంబై: 15.4 ఓవర్లలో 177/1 (రోహిత్ 76*, సూర్య 68*, జడేజా 1/28)