Border – Gavaskar Trophy : న్యూజిలాండ్ చేతిలో వరుసగా రెండు ఓటములతో ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (WTC 2024-25) ఫైనల్ అవకాశాల్ని సంక్షిష్టం చేసుకుంది భారత జట్టు. హ్యాట్రిక్ ఫైనల్ ఆడాలన్నా.. టెస్టు గద (Test Mace)ను ముద్దాడాలన్నా ఇక ఆన్నిటికి అన్ని టెస్టులు గెలవాలి. ఈ నేపథ్యంలో కీలకమైన బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీ కోసం సెలెక్టర్లు స్క్వాడ్‌ను ఎంపిక చేశారు. అయితే.. స్క్వాడ్‌లో కొత్త ముఖాలకు చోటివ్వడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కుర్రాళ్లకు భలే చాన్స్ అని కొందరు అంటుంటే.. ‘సీనియర్లు లేకుండా ఆస్ట్రేలియా పర్యటనా?’ అని కొందరు పెదవి విరుస్తున్నారు.
టీమిండియా మాజీ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ ( MSK Prasad) కూడా బీసీసీఐ సెలెక్టర్ల తీరును తప్పుబట్టాడు. ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాను కాదని తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డిని తీసుకోవడం అర్థ రహితమని ఎమ్మెస్కే అన్నాడు. ఐపీఎల్లో నిలకడగా రాణించిన నితీశ్ ఈమధ్యే బంగ్లాదేశ్‌పై టీ20 సిరీస్‌లో దంచేసి సెలెక్టర్ల దృష్టిలో పడ్డాడు. తరచూ గాయాల బారిన పడే పాండ్యాకు బదులు నితీశ్‌కు అవకాశం ఇవ్వాలని బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీకి ఎంపకి చేశారు. అయితే.. అనుభవం గల పాండ్యాను విస్మరించడం సరైన నిర్ణయం కాదని ఎమ్మెస్కే అభిప్రాయ పడుతున్నాడు.
From Dreams to Reality! Nitish Kumar Reddy in India’s Squad for the Iconic Border-Gavaskar Trophy. pic.twitter.com/MAssEBjNFR
— SunRisers OrangeArmy Official (@srhfansofficial) October 25, 2024
‘నితీశ్ ఏమీ పాండ్యా కాదు. అతడు పాండ్యా మాదిరిగా గంటకు 140 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేయలేడు. నితీశ్ వేగం గంటకు 125 నుంచి 130 కిలోమీటర్లు మాత్రమే. పైగా నితీశ్ ఇప్పటివరకూ టెస్టు క్రికెట్ ఆడనేలేదు అని ఎమ్మెస్కే తన మనసులోని మాట చెప్పాడు. ఏమాత్రం టెస్టు క్రికెట్ అనుభవం లేని నితీశ్‌ను పేస్ పిచ్‌లకు నెలవైన ఆస్ట్రేలియా పర్యటనకు తీసుకోవడం సమంజసం కాదనేది అతడి వాదన.
🚨 NEWS 🚨
Squads for India’s tour of South Africa & Border-Gavaskar Trophy announced 🔽#TeamIndia | #SAvIND | #AUSvIND pic.twitter.com/Z4eTXlH3u0
— BCCI (@BCCI) October 25, 2024
భారత స్క్వాడ్ : రోహిత్ శర్మ(కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా(వైస్ కెప్టెన్), అభిమన్యు ఈశ్వరన్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్(వికెట్ కీపర్), సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), అశ్విన్, జడేజా, సిరాజ్, ఆకాశ్ దీప్, హర్షిత్ రానా, ప్రసిధ్ కృష్ణ, నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్.
భారత్, ఆస్ట్రేలియాల మధ్య నవంబర్ 22న ఐదు టెస్టుల సిరీస్ మొదలవ్వనుంది. 1999 తర్వాత తొలిసారి ఐదు మ్యాచ్‌లుగా జరుగుతున్న ఈ సిరీస్ భారత్‌కు కీలకం కానుంది. డబ్ల్యూటీసీ ఫైనల్ చేరాలంటే రోహిత్ సేన కచ్చితంగా కంగారూలను ఓడించాలి. అంతకంటేముందు సొంతగడ్డపై టీమిండియా పేరిట 12 ఏండ్లుగా చెక్కు చెదరకుండా ఉన్న రికార్డును బ్రేక్ చేసిన న్యూజిలాండ్‌కు ఆఖరి టెస్టులో చుక్కలు చూపించాలి. అదే ఊపులో ఆసీస్ గడ్డపై హ్యాట్రిక్ విజయంతో సిరీస్ కొల్లగొడితే.. టెస్టు గదకు పోటీ పడే అవకాశం రోహిత్ సేనకు దక్కడం ఖాయం.