Perni Nani | వైఎస్ జగన్, షర్మిల మధ్య తలెత్తిన ఆస్తి వివాదంలో విజయమ్మ జడ్జిగా ఉండాలని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి పేర్ని నాని ఘాటుగా స్పందించారు. జడ్జిగా ఉండేవాళ్లు మధ్యస్థంగా ఉండాలి కదా.. ఒకరివైపు ఉండేవాళ్లు జడ్జి ఎలా అవుతారని ప్రశ్నించారు.
తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం పేర్ని నాని మీడియాతో మాట్లాడారు. వైసీపీ వద్దు అని వెళ్లిపోయిన బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఇప్పుడు ఉన్నట్టుండి పెద్ద మనిషి అవతారం ఎందుకు ఎత్తారని పేర్ని నాని నిలదీశారు. బాలినేని విషయంలో ఇప్పుడు అవసరాల కోసం చేసే రాజకీయాలే కనిపిస్తున్నాయని విమర్శించారు. బాలినేని రాజకీయాల కోసం ఏదైనా మాట్లాడతారని అన్నారు. ఇప్పుడు జనసేనలో ఉన్నందున ఆ పార్టీలైన్ మాట్లాడుతున్నారని విమర్శించారు.
ప్రజల ఆస్తులను అమ్మడంలో చంద్రబాబు దిట్ట అని పేర్ని నాని అన్నారు. సంపద సృష్టించడం దేవుడెరుగు.. సృష్టించిన సంపదను కూడా తెగనమ్ముతున్నారని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన తర్వాత45వేల కోట్ల అప్పులు తెచ్చారని విమర్శించారు.ప్రభుత్వ ఆస్తులను దొడ్డిదారిన తన వారికి చంద్రబాబు దోచిపెట్టే కార్యక్రమం చేపట్టారని అన్నారు.