MS Dhoni – Trump : అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. అమెరికన్ల హక్కులకే నా తొలి ప్రాధాన్యమంటూ బరిలోకి దిగిన రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) జయకేతనం ఎగురవేశాడు. ఈ సమయంలో ట్రంప్ ప్రచారపర్వం.. అతడి విజయోత్సవ సభతో పాటు ట్రంప్‌కు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. వీటిలో ఓ వీడియో మాత్రం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇంతకూ అందులో ఉన్నది ఎవరంటే..? భారత జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni).
ట్రంప్‌తో కలిసి ధోనీ గోల్ఫ్ ఆడుతున్న వీడియో అది. నేషనల్ గోల్ఫ్ క్లబ్లో తీసిన ఈ వీడియో ఎప్పటిదో తెలుసా..? టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ 2023లో యూఎస్ ఓపెన్ (US Open) టోర్నీ చూసేందుకు అమెరికా వెళ్లాడు. కార్లోస్ అల్కరాజ్, అలెగ్జాండర్ జ్వెరెవ్‌ల మధ్య జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌ను వీక్షించిన మహీభాయ్ అనంతరం సరదాగా ట్రంప్‌తో కలిసి గోల్ఫ్ ఆడాడు. ఆ తర్వాత ఆయనతో కలిసి ఫొటోలు కూడా దిగాడు.
MS Dhoni playing golf with Donald Trump.
– The craze for Dhoni is huge. pic.twitter.com/fyxCo3lhAQ
— Johns. (@CricCrazyJohns) September 8, 2023
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరఫున పోటీ చేసిన డొనాల్డ్ ట్రంప్ చారిత్రాత్మక విజయం సాధించాడు. 132 ఏండ్ల చరిత్రను తిరగరాశాడు. డెమోక్రాటిక్ అభ్యర్థి కమలా హ్యారిస్ (Kamala Harris)పై విజయదుందుభి మోగించిన ట్రంప్ రెండోసారి అధ్యక్ష పీఠం మీద కూర్చోబోతున్నాడు. వ్యాపారవేత్త అయిన ట్రంప్ యూఎస్ 45వ అధ్యక్షుడిగా 2017లో ప్రమాణస్వీకారం చేశాడు. అయితే.. 2020లో జరిగిన ఎన్నికల్లో జో బైడెన్ చేతిలో ఓటమి పాలయ్యాడు. ఇక ధోనీ విషయానికొస్తే.. ఐపీఎల్ 18వ సీజన్లో అన్క్యాప్డ్ ప్లేయర్‌గా ఆడబోతున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ మహీని రూ.4 కోట్లకు అట్టిపెట్టుకుంది.