MS Dhoni : ఇండియన్ ప్రీమియర్ లీగ్లో మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni)కి ఉన్న క్రేజ్ తెలిసిందే. సారథిగా చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings)ను ఐదుసార్లు విజేతగా నిలిపిన మహీ భాయ్ 17వ సీజన్లో పగ్గాలు వదిలేశాడు. దాంతో, 2025 ఎడిషన్ ధోనీకి ఆఖరి ఐపీఎల్ అనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే.. ఈసారి కెప్టెన్ ‘అన్క్యాప్డ్ ప్లేయర్’గా ఆడే అవకాశం ఉంది. అదే జరిగితే ధోనీ జీతంలో భారీ కోత పడనుంది. ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ తీసుకొచ్చిన నిబంధనలే అందుకు కారణమని తెలుస్తోంది.
పదిహేడో సీజన్లో ధోనీకి చెన్నై సూపర్ కింగ్స్ రూ.12 కోట్లు ముట్టజెప్పింది. కానీ, ఇప్పుడు ధోనీ అన్క్యాప్డ్గా బరిలోకి దిగనున్నాడు. అదే జరిగితే.. 18వ సీజన్లో అతడి ఆదాయంలో రూ. 8 కోట్లు కోత పడనుంది. అన్క్యాప్ట్ ప్లేయర్ ఎవరైనా సరే వాళ్లకు రూ. 4 కోట్లు మాత్రమే ఇవ్వాలని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ స్పష్టం చేసింది.
అందుకని సీఎస్కే ఫ్రాంచైజీ తాలాకు రూ. 4 కోట్లు జీతంగా ఇవ్వనుంది. ఐపీఎల్ 17వ సీజన్ తొలి మ్యాచ్కు ముందే ధోనీ సీఎస్కే సారథ్య బాధ్యతల నుంచి వైదొలిగాడు. తన వారసుడిగా రుతురాజ్ గైక్వాడ్(Ruturaj Gaikwad)ను ప్రకటించి హుందాగా కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు.
ఎట్టేకేలకు రిటెన్షన్ విధానం (Retention Rule)పై ఉత్కంఠ వీడింది. మెగా వేలం తేదీ కూడా దగ్గరపడుతోంది. నవంబర్ చివరి వారం లేదా డిసెంబర్ మొదటి వారంలో ఆక్షన్ నిర్వహిస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. అందుకని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఫ్రాంచైజీలకు రిటెన్షన్ లిస్ట్ ఇవ్వడానికి గడువు విధించింది. అక్టోబర్ 31 తేదీ సాయంత్రం 5 గంటల లోపు ఆట్టిపెట్టుకుంటున్న ఆటగాళ్ల జాబితాను తమకు సమర్పించాలని ఫ్రాంచైజీల యజమానులను ఆదేశించింది. దాంతో, నిర్ణీత సమయంలోపు లిస్ట్ పంపేందుకు పది జట్లు సిద్ధమవుతున్నాయి. ఇక.. మెగా వేలం దృష్ట్యా ఫ్రాంచైజీల పర్స్ వాల్యూను రూ.120 కోట్లుకు పెంచిన విషయం తెలిసిందే.