Janhvi Kapoor | సినిమాలో పాత్రలు స్ట్రాంగ్‌గా వుంటే.. వాటి ఔచిత్యంలో క్లారిటీ వుంటే ఆ పాత్రలు వెండితెరపై బాగా పండుతాయి. అలాంటి క్యారెక్టర్స్ అందరికి చిరకాలం గుర్తుండిపోతాయి. అందుకే పాత్రల సృష్టి విషయంలో దర్శకులు శ్రద్ధ పెడుతుంటారు. పాత్రలు శక్తివంతంగా వుంటే.. ఆ సినిమా విజయంలో కూడా అవి కీలక భూమిక పోషిస్తాయి.
ఇక వివరాల్లోకి వెళితే.. ఎన్టీఆర్ హీరోగా, కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన చిత్రం జనతా గ్యారేజ్. ఈ చిత్రం సాధించిన విజయం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే తాజాగా ఈ ఇద్దరి కలయికలో రూపొందిన మరో చిత్రం ‘దేవర’. ఎన్టీఆర్ ద్విపాత్రాభినయంలో నటించిన ఈ చిత్రం ఈ నెల 27న విడుదలైన సంగతి అందరికి విదితమే. ఈ చిత్రానికి మంచి టాకే వచ్చింది.
ముఖ్యంగా ఈ చిత్రంలో ఎన్టీఆర్ అభినయానికి, ఆయన అభిమానులు ఫిదా అవుతున్నారు. ఈ చిత్రం మంచి ఓపెనింగ్స్‌ను సాధించింది. రెండు తెలుగు రాష్ట్రల్లోనే కాకుండా విదేశాల్లో కూడా రికార్డుల కలెక్షన్లను సాధిస్తోంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ నటించిన దేవర, వర పాత్రలు కూడా అందర్ని ఆకట్టుకుంటున్నాయి. ఈ రెండు పాత్రలు కూడా ఎంతో శక్తివంతంగా వున్నాయి. కాగా ఈ చిత్రంతోనే టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన ప్రముఖ నటి శ్రీదేవి తనయురాలు జాన్వీ కపూర్ పాత్రపై కామెంట్స్ వినపడుతున్నాయి.
తంగం పాత్రలో కనిపించిన జాన్వీ పాత్ర నిడివి చాలా తక్కువ వుందని, కేవలం గ్లామర్ కోసమే జాన్వీని తీసుకున్నట్లుగా కనిపించిందని, ఆమెలోని నటనను కొరటాల వాడుకోలేదని విమర్శలు వస్తున్నాయి. తంగం పాత్రతో చెప్పించిన డైలాగులు కూడా అంతగా యాప్ట్‌గా లేవని అంటున్నారు సినీ జనాలు. తంగం పాత్రపై శ్రద్ధ పెట్టి, ఆ పాత్రను కూడా ఆకర్షణీయంగా డిజైన్ చేస్తే సినిమాకు ప్లస్ అయ్యేందని అంటున్నారు రివ్యూవర్స్. జాన్వీ కూడా ఈ విషయంలో కాస్త ఇంట్రెస్ట్ చూపాలని అంటున్నారు ఆమె అభిమానులు.