Mohammad Shami : ప్రతిష్ఠాత్మక బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీ ఆరంభానికి ముందే మాటల యుద్ధానికి తెర లేచింది. భారత్, ఆస్ట్రేలియా దేశాల మాజీ క్రికెటర్లు ఇప్పటికే తమ జట్టు గెలుస్తుందంటే.. తామే విజేతలం అవుతామంటూ పోటాపోటీగా వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా భారత స్పీడ్‌స్టర్ మహమ్మద్ షమీ (Mohammad Shami) సైతం ఈ సిరీస్‌పై స్పందించాడు. ఈసారి కూడా తామే ఫేవరెట్లమని, ఆస్ట్రేలియా గడ్డపై హ్యాట్రిక్ కొడుతామని షమీ కంగారూ జట్టును హెచ్చరించాడు.
ఆస్ట్రేలియాపై చిరస్మరణీయ విజయాలతో చరిత్ర సృష్టించిన భారత జట్టు నవంబర్‌లో మళ్లీ అక్కడికి వెళ్లనుంది. ఇప్పటికే 2018-19, 2020-21లో విజేతగా నిలిచిన టీమిండియా ఈసారి కూడా విజయంపై ధీమాతో ఉంది. ఈ నేపథ్యంలో షమీ భారత్‌దే ట్రోఫీ అని చెప్పేశాడు. ‘భారత జట్టే ఫేవరట్ అని నేను గట్టిగా నమ్ముతున్నా. గత ఆసీస్ పర్యటనలో సీనియర్లు లేరు. యువకులతో కూడిన జట్టుతోనే ఆడాం. ఇప్పటికీ మాదే గొప్ప అని నిరూపించుకుంటాం.
అయితే.. ఈసారి ఆసీస్ నుంచి గట్టి పోటీ ఎదురుకానుంది. అయినా సరే గెలిచేది టీమిండియానే అని కోల్‌కతాలో జరిగిన ఓ అవార్డుల కార్యక్రమంలో’ షమీ తెలిపాడు. వరల్డ్ కప్ తర్వాత మోకాలి సర్జరీ నుంచి కోలుకున్న షమీ.. ప్రస్తుతం ఫిట్నెస్ మీద దృష్టి పెట్టాడు. పునరాగమనంపై తానేమీ తొందరపడడం లేదని, మానసికంగా.. శారీరకంగా ఫిట్‌గా మారాకే ఇండియా తరఫున ఆడుతా’ అని ఈ సందర్భంగా షమీ అక్కడి అభిమానులతో చెప్పాడు. త్వరలో జరుగబోయే బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌కు దూరమైన షమీ ఆస్ట్రేలియా సిరీస్‌లోపు ఫిట్నెస్ సాధించాలని భారత మేనేజ్మెంట్ సహా, అభిమానులంతా కోరుకుంటున్నారు.
ఈ ఏడాది నవంబర్‌లో భారత జట్టు ఆసీస్ పర్యటనకు వెళ్లనుంది. 22వ తేదీన ఇరుజట్ల మధ్య తొలి టెస్టు జరుగనుంది. 1992 తర్వాత తొలిసారి ఈ సిరీస్‌ను ఐదుమ్యాచ్లుగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ప్రపంచంలోని మేటి జట్లు అయిన భారత్, ఆస్ట్రేలియాలు మైదానంలోకి దిగితే హోరాహోరీ తప్పదు. అది కూడా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో అయితే ఇరుజట్ల ఆటగాళ్లు స్లెడ్జింగ్ కవ్వింపులతో ఆటను మరింత రక్తి కట్టిస్తారు.
అంతేకాదండోయ్.. పోటాపోటీగా శతకాలతో.. వికెట్ల వేటతో చెలరేగిపోతారు కూడా. అయితే.. గత రెండు పర్యాయాలు టీమిండియా దెబ్బకు కంగారు జట్టు తోకముడిచింది. దాంతో, ఈసారి సొంతగడ్డపై ఎలాగైనా సరే ట్రోఫీ సాధించి పరువు కాపాడుకోవాలని ప్యాట్ కమిన్స్ నేతృత్వంలోని ఆసీస్ భావిస్తోంది. మరోవైపు.. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(WTC) ఫైనల్ రేసులో ముందున్న భారత్ కూడా విజయమే లక్ష్యంగా బరిలోకి దిగనుంది. ఇంకేముంది.. రెండు సమఉజ్జీల మధ్య టెస్టు సమరం భలే రంజుగా సాగడం పక్కా.