Mohammad Rizwan : కెప్టెన్సీపై గంపెడు ఆశలు పెట్టుకున్న పాకిస్థాన్ స్టార్ ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ (Mohammad Rizwan)కు మరోసారి నిరాశే మిగిలింది. వన్డే వరల్డ్ కప్(ODI World Cup 2023) అనంతరం బాబర్ ఆజాం(Babar Azam) కెప్టెన్‌గా తప్పుకున్నాక .. ఈ స్టార్ బ్యాటర్‌ను సారథిగా ప్రకటిస్తారని అందరూ ఊహించారు. కానీ, సెలెక్టర్లు షాన్ మసూద్(Shan Masood)కు వన్డే, పేసర్ షాహీన్ ఆఫ్రిది(Shaheen Afridi)కి టీ20 పగ్గాలు అప్పగించారు. దాంతో, రిజ్వాన్‌కు కెప్టెన్సీ ఇస్తే బాగుండేదని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడ్డారు.
ఈ నేపథ్యంలో దిద్దుబాటు చర్యలు చేపట్టిన పాక్ బోర్డు అతడిని వైస్ కెప్టెన్‌గా నియమించింది. న్యూజిలాండ్ పర్యటనలో ఐదు టీ20ల సిరీస్‌కు జట్టును ప్రకటించిన బోర్డు.. రిజ్వాన్‌కు వైస్ కెప్టెన్సీ అప్పగించింది. ఆ సిరీస్‌లో షాహీన్ ఆఫ్రిదికి రిజ్వాన్ డిప్యూటీగా వ్యవహరించనున్నాడు. పొట్టి ప్రపంచ కప్ ఉన్నందున పాక్ జట్టును మరింత పటిష్టం చేసే బాధ్యత ఈ ఇద్దరికి అప్పగించారు.
.@iMRizwanPak has been appointed vice-captain of Pakistan’s T20I team 🚨 pic.twitter.com/0Zu6DcstML
— Pakistan Cricket (@TheRealPCB) January 8, 2024
పాకిస్థాన్ స్క్వాడ్ : షాహీన్ షా ఆఫ్రిది(కెప్టెన్), అమర్ జమాల్, అబ్బాస్ అఫ్రిది, అజమ్ ఖాన్(వికెట్ కీపర్), బాబర్ ఆజాం, ఫఖర్ జమాన్, హ్యారిస్ రౌఫ్, హసీబుల్లా(వికెట్ కీపర్), ఇఫ్తికార్ అహ్మద్, మహ్మద్ నవాజ్, రిజ్వాన్(వైస్ కెప్టెన్), మహ్మద్ వసీం జూనియర్, సహిబ్జద ఫర్హాన్, సయీం ఆయూబ్, ఉసామ మిర్, జమాన్ ఖాన్.
కివీస్ గడ్డపై పాక్ ఐదు టీ20లు ఆడనుంది. ఇరుజట్ల మధ్య జనవరి 12న ఆక్లాండ్‌లోని ఈడెన్ పార్క్‌లో తొలి మ్యాచ్ జరుగనుంది. జనవరి 14న హమిల్టన్‌లో రెండో టీ20, 17వ తేదీన డెనెడిల్లో మూడో మ్యాచ్ , 19న క్రిస్ట్‌చర్చ్‌లో నాలుగో మ్యాచ్, 21న క్రిస్ట్చర్చ్లోనే ఐదో టీ20 నిర్వహించనున్నారు.
ప్రపంచంలోని విధ్వంసక బ్యాటర్లలో ఒకడైన రిజ్వాన్ పాక్ తరఫున 85 టీ20లు ఆడాడు. ఒక సెంచరీ, 25 హాఫ్ సెంచరీలతో కలిపి 2,797 పరుగులు సాధించాడు. నిరుడు ఆస్ట్రేలియా గడ్డపై జరిగిన టీ20 వరల్డ్ కప్‌లో రిజ్వాన్ అద్భుతంగా రాణించాడు. ఈసారి వెస్టిండీస్, అమెరికా ఆతిథ్యమిస్తున్న మెగా టోర్నీలో మరోసారి సత్తా చాటేందుకు ఈ లెఫ్ట్‌హ్యాండర్ ఆతృతగా ఎదురుచుస్తున్నాడు.