The Raaja Saab | బాహుబలి తర్వాత లార్జర్ దేన్ లైఫ్ తరహా సినిమాలతోనే ప్రయాణం చేస్తున్నారు ప్రభాస్. ఫ్యాన్స్ ఆయనను వింటేజ్ డార్లింగ్ లుక్ లో చూసి చాలా కాలమైయింది. ఆ లోటుని భర్తీ చేసే సినిమా ‘రాజాసాబ్’ అని స్వయంగా డైరెక్టర్ మారుతి చెప్పడం, కెరీర్ లో తొలిసారి ప్రభాస్ ఒక హారర్ ఫాంటసీ సబ్జెక్ట్ ని ఎంచుకోవడం, ప్రచార చిత్రాలు ఆసక్తిని రేపడం, సంక్రాంతి రేసులో తొలి సినిమాగా రావడంతో మంచి హైప్, అంచనాలు ఏర్పడాయి. మరి ఆ అంచనాలని రాజసాబ్ అందుకుందా? ఈ సంక్రాంతి తొలి విజయం నమోదైయిందా? రివ్యూలో చూద్దాం.
కథ : రాజు అలియాస్ రాజాసాబ్ (ప్రభాస్)కు అమ్మానాన్న అన్నీ నాయనమ్మ గంగాదేవి(జరీనా వహాబ్)నే. గంగాదేవికి ఆల్జీమర్స్. ప్రతి విషయాన్ని మర్చిపోతుంటుంది. కాకపోతే ఎప్పుడో తనని విడిచిపెట్టి వెళ్ళిపోయిన భర్త కనకరాజు (సంజయ్‌దత్)ని మాత్రం గుర్తుపెట్టుకుంటుంది. తాత కనకారాజు కోసం వెదుకుతున్న రాజుకు కొన్ని సంచలన నిజాలు తెలుస్తాయి. నర్సాపూర్ అడవిలోని ఓ రాజమహల్ వున్నాడనే సంగతి తెలుసుకుంటాడు. ఆ రాజమహల్ అడుగుపెట్టిన రాజుకి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి ? కనకరాజు గురించి ఎలాంటి నిజాలు తెలుసుకున్నాడు? అసలు గంగాదేవి గతం ఏమిటి? కనకరాజు గంగాదేవిని ఎందుకు వదిలివెళ్ళిపోయాడు? తన లక్ష్యం ఏమిటి? నాయనమ్మ కోసం రాజు ఎలాంటి పోరాటం చేశాడనేది మిగతా కథ.
విశ్లేషణ: నాయనమ్మకి జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకున్న మనవడి కథ ఇది. ఒక హారర్ ఫాంటసీ సరిపడే ముడిసరకు ఈ కథలో పుష్కలంగా వుంది. హిప్నాటిజంతో పాటు తాంత్రిక విద్యలు తెలిసిన విలన్ ని తన మనోబలంతో హీరో ఎలా జయించాడనే పాయింట్ బలమైనదే. కాకపోతే ఇందులో సంఘర్షణ, సన్నివేశాలు, కథనం అల్లిన తీరు ఇంకా ప్రభావవంతంగా ఉండాల్సింది.
సత్య పాత్ర రాజ్ మహాల్ ప్రవేశం, అక్కడ జరిగిరే సన్నివేశాలు థ్రిల్లింగ్ ఫీలింగ్ కలిగిస్తూ సినిమా కథ మొదలౌతుంది. ఈ సీక్వెన్స్ రాజాసాబ్ పై అంచనాలు పెంచుతుంది. రాజు పాత్రలో ప్రభాస్ ఎంట్రీ ఆ తర్వాత వచ్చే పాట వింటేజ్ డార్లింగ్ ని గుర్తు చేస్తుంది. తర్వాత తాతని వెదికే క్రమంలో వచ్చే సన్నివేశాలు సాదాసీదాగా సాగుతాయి. హీరోయిన్స్ ట్రాక్స్ సరిగ్గా వర్క్ అవుట్ కాలేదు. రాజు పాత్ర మహాల్ లోకి ఎంట్రీ ఇస్తేనే అసలు కథ మొదలౌతుంది. కాకపోతే ఆ ఘట్టానికి రావడానికి ఇంటర్వెల్ వరకూ ఎదురుచూసేలా చేశారు. దీంతో అప్పటివరకూ సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది.
ద్వితీయార్ధంలో మారుతి రాసుకున్న అసలు కాన్సెప్ట్ తెరపైకి వస్తుంది. కాకపొతే ఇది ఆడియన్స్ ని కాస్త తికమక పెడుతుంది. కనకరాజు పాత్రలో సంజయ్ దత్ చేసే హిప్నటిజం ఆడియన్స్ కి ఇంకా బలంగా రిజిస్టర్ చేయాల్సింది. బోమన్ ఇరానీ పాత్ర వచ్చే వరకూ చాలా విషయాలు కన్ఫ్యుజన్ లోనే వుంటాయి. అలాగే ఆ మహల్ ప్రవేశించిన పాత్రలు పెద్ద సవాళ్లు ఎదురుకావు. కామెడీ కూడా సరిగ్గా వర్క్ అవుట్ కాలేదు. దీంతో ఆడియన్స్ కి జరుగుతున్న సంఘటనలపై ఆసక్తి తగ్గుతుంది. కాకపోతే ప్రీక్లైమాక్స్ క్లైమాక్స్ సినిమాకి ఆయువు పట్టుగా నిలిచాయి. ఆ సన్నివేశాలు ఉత్కంఠభరితంగా తీర్చిదిద్దారు.
ఎవరెలా చేశారు? ప్రభాస్ మళ్ళీ వింటేజ్ లుక్ లో చూడటం ఆయన ఫ్యాన్స్ ని ఖుషి చేస్తుంది. చాలా కాలం తర్వాత ఫన్ బాడీ లాంగ్వేజ్, ఫైట్స్, డ్యాన్సులు.. ఇలా కలర్ ఫుల్ అవతార్ లో కనిపించారు. హాస్పిటల్ సీన్ లో తన నటన ఎమోషనల్ హత్తుకుంటుంది. సంజయ్ దత్ పర్సనాలిటీ ఆ క్యారెక్టర్ కి ప్లస్ అయ్యింది. కాకపొతే ఆ పాత్రని ఇంకా బలంగా రాయాల్సింది. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ తెరపై అందంగా కనిపించారు. అయితే ఆ పాత్రలు కథలో మిళితం కాలేదు. జరీనా వాహెబ్ తన అనుభవం చూపించారు. వీటీవీ గణేష్, సప్తగిరి, ప్రభాస్ శ్రీను, సత్య.. అక్కడక్కడ నవ్వించారు.
టెక్నికల్ గా: తమన్ నేపధ్య సంగీతం పవర్ ఫుల్ గా వుంది. చాలా చోట్ల ఎమోషన్ ఎలివేట్ చేసింది. కాకపోతే కొన్ని చోట్ల మరీ లౌడ్ అనే ఫీలింగ్ కూడా కలిగిస్తుంది. రాజ్ మహల్ సెట్ ని గ్రాండ్ గా తీర్చిదిద్దారు. కార్తీక్ పళని కెమెరా పనితనం ఆకట్టుకుంటుంది. విజువల్ ఎఫెక్ట్స్ బావున్నాయి. పీపుల్ మీడియా ఫాక్టరీ నిర్మాణ విలువలు ఉన్నంతంగా వున్నాయి. మారుతి ఎంచుకున్న హారర్ ఫాంటసీ కాన్సెప్ట్ బావుంది. కాకపోతే ఆ కాన్సెప్ట్ ఎఫెక్టివ్ గా తీసుంటే ఎక్స్ పీరియన్స్ ఇంకా బెటర్ గా వుండేది.
ప్లస్ పాయింట్స్:
ప్రభాస్
ప్రీక్లైమాక్స్, క్లైమాక్స్
నిర్మాణ విలువలు
మైనస్ పాయింట్స్
గతి తప్పిన డైరెక్షన్
ఆకట్టుకోని కథనం
రేటింగ్: 2.75/5