FIR on Boxing Coach : యువ బాక్సర్లకు మెలకువలు చెబుతూ వాళ్లను గొప్పగా తీర్చిదిద్దాల్సిన ఓ కోచ్ అడ్డదారి తొక్కింది. జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న మైనర్ బాక్సర్(Minor Boxer)పై లైగింక వేధింపులకు పాల్పడింది. దాంతో, ఆ బాలిక తల్లిదండ్రులు సదరు కోచ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వాళ్ల కంప్లైట్ మేరుకు ఆ కోచ్‌పై పోలీసులు ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేశారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (SAI)కి చెందిన రోహటక్లోని నేషనల్ బాక్సింగ్ అకాడమీ(NBA)లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇదే విషయంపై శాయ్, భారత బాక్సింగ్ సమాఖ్య అధికారులను సంప్రదించగా.. కోచ్ ప్రవర్తనతో భయభ్రాంతులకు గురైన ఆ అమ్మాయి పోలీసులను ఆశ్రయించినట్టు ధ్రువీకరించారు.
బాక్సింగ్‌లో రాణిస్తున్న 17 ఏళ్ల బాలికను రోహటక్లోని జాతీయ బాక్సింగ్ శిక్షణ కేంద్రంలో చేర్పించారు ఆమె తల్లిదండ్రులు. అయితే.. అక్కడి మహిళా కోచ్ సదరు అమ్మాయిని లైగింకంగా వేధించడం మొదలు పెట్టింది. ఆమె తీరుతో భయపడిపోయిన ఆ బాలిక.. తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనైంది. అయినా సరే కోచ్ ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో తన తల్లిదండ్రులతో తన భాధను పంచుకుంది యువ బాక్సర్. అనంతరం రోహటక్లోని పోలీసులకు మహిళా కోచ్‌పై ఫిర్యాదు చేసింది. ఎఫ్ఐఆర్ కాపీలో ఆ బాలిక సంచలన విషయాలను వెల్లడించింది.
National-Level Minor Boxer Alleges Sexual Harassment By Woman Coach; Parents Lodge FIR#Boxing https://t.co/Gi3ncXidpg
— NDTV Sports (@Sports_NDTV) June 30, 2025
‘కోచ్ నన్ను తరచూ వేధించేది. ఒక్కోసారి నా దుస్తులు విప్పాలని బలవంతం చేసేది. నేను తిరస్కరించేసరికి ఆమె నాపై పలుమార్లు చేయి చేసుకుంది. అంతేకాదు నా కెరియర్ను నాశనం చేస్తానని బెదిరించేది. దాంతో.. ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేశాను’ అని పదిహేడేళ్ల బాక్సర్ వెల్లడించింది. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న పోలీసులు మహిళా కోచ్‌పై భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 115, లైగింక వేధింపుల నుంచి పిల్లల సంరక్షణ 351(3), భయభ్రాంతులకు గురిచేయడం వంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంపై స్పందించిన శాయ్ అధికారులు తమకు ఎఫ్ఐఆర్ కాపీ అందలేదని, కాకపోతే ఒక మైనర్ బాక్సర్ ఈమెయిల్ ద్వారా ఫిర్యాదు చేసిందని తెలిపారు.