Abhishek Bachchan | బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్, ఆయన కుటుంబం గురించి సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ నడుస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా తన ఫ్యామిలీపై నడుస్తున్న ట్రోలింగ్ గురించి అభిషేక్ బచ్చన్ స్పందించారు. తనతో పాటు తన భార్య ఐశ్వర్యరాయ్, కూతురు ఆరాధ్య బచ్చన్ పై సోషల్ మీడియాలో చేస్తున్న అనేక అవమానకరమైన కామెంట్లను అభిషేక్ బచ్చన్ తీవ్రంగా ఖండించారు. తన కుటుంబంపై ఇలాంటి అసత్య ప్రచారాలు ఎలాంటి ప్రభావం చూపుతాయో చెబుతూ ఆన్లైన్ ట్రోలింగ్‌ని తీవ్రంగా ఖండించారు.
ఈటైమ్స్‌కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన అభిషేక్.. ఒకప్పుడు నాపై వచ్చే విమర్శలను పెద్దగా పట్టించుకునే వాడిని కాదు. కానీ ఇప్పుడు కుటుంబం ఉన్నందున అవి నన్ను ఎంతగానో బాధిస్తున్నాయని అన్నారు. ఈ రోజు నాకు ఒక కుటుంబం ఉంది. ఇలాంటి వార్తలు ఎంతో బాధిస్తాయి. ట్రోలింగ్ గురించి నేను ఏదైనా వివరణ ఇవ్వాలని ప్రయత్నించినా, దాన్ని కూడా వక్రీకరించడం చేస్తారు. నెగెటివ్ వార్తలకే ఇక్కడ ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. నేను ఎవరికైతే జవాబుదారీగా ఉండాలో, వారు మీరు కాదు అంటూ అభిషేక్ అన్నారు.
నెగెటివ్ వార్తలు సృష్టించేవాళ్లు తమ మనస్సాక్షికే సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైన ఉంది. ఇలాంటి వాటి వల్ల నేను పెద్దగా ప్రభావితం కాను కానీ ఇందులో కుటుంబాలు కూడా ఇమిడి ఉంటాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రోలింగ్ అనే కొత్త ఫ్యాషన్ నడుస్తోంది అభిప్రాయపడ్డారు అభిషేక్ బచ్చన్.. కంప్యూటర్ స్క్రీన్ వెనుక అజ్ఞాతంగా దాక్కుని ఇష్టం వచ్చిన రాతలు రాయడం చాలా సులభం. కాని ఆ మాటలు ఎదుటివారిని ఎంతగా బాధిస్తాయో కాస్త గ్రహించాలి. ఎంతటి వారినైన ఇలాంటివి చాలా బాధిస్తాయి. మీ విషయంలో కూడా ఇలానే జరిగితే ఎలా ఉంటుంది అని ప్రశ్నించారు. ఒకవేళ మీకు దమ్ముంటే అవే మాటలు నా ముఖం మీద చెప్పంది. నా ముఖం మీదే చెప్పే వారిలో నిజాయితీ ఉందని భావించి గౌరవిస్తాను అంటూ అభిషేక్ పేర్కొన్నారు.